మాతాశిశు మరణాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలను నివారించాలి

Mar 13 2026 8:58 AM | Updated on Mar 13 2026 8:58 AM

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజ్‌బేగం

పుట్టపర్తి అర్బన్‌: సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లోనూ మాతాశిశు మరణాలు సంభవిస్తుండడం బాధాకరమని, వీటిని పూర్తి స్థాయిలో నివారించాలంటూ సంబంధిత వైద్యాధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజ్‌బేగం సూచించారు. జిల్లాలో గత ఫిబ్రవరిలో చోటు చేసుకున్న రెండు మాతృ, 9 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులతో శుకవ్రారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆమె సమీక్షించారు. రెండు మాతృ మరణాలపై పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌ నేహా తబ్సుమ్‌, 9 శిశు మరణాలపై హిందూపురంలోని జిల్లాస్పత్రి డాక్టర్‌ వెంకటేశ్వర్లు నివేదికలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జన్మించిన అనంతరం ఉత్పన్నమైన వివిధ రకాల రుగ్మతలతో శిశువులు మరణించడం బాధాకరమన్నారు. తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరూ తీర్చలేరని, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా కార్యకర్తలు నిరంతర పర్యవేక్షణతో మాతాశిశు మరణాల నివారణలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ నాగేంద్రనాయక్‌, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

జర్నలిస్టులకు

ఉచిత కంటి పరీక్షలు

అనంతపురం టవర్‌క్లాక్‌: ఈ నెల 17న ఉమ్మడి అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నాట్లు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతరాయంగా కంప్యూటర్లపై విధులు నిర్వర్తిస్తున్న కారణంగా జర్నలిస్టులు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17న అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో కంటి వైద్య శిబిరాన్ని కేవలం జర్నలిస్టుల కుటుంబాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98491 52149, 73869 58666, 80745 86699,94900 62555 లో సంప్రదించాలన్నారు.

హోటళ్లలో తనిఖీలు

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్ల వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులతో కలసి తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి, సీఎస్‌డీటీ రామకృష్ణ గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గృహ వినియోగ వంట గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డోమెస్టిక్‌ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.

కేంద్రీయ విద్యాలయలో ఇంటర్వ్యూలు

గోరంట్ల: మండలంలోని పాలసముద్రం సమీపంలో ఉన్న నాసిన్‌ కేంద్రీయ విద్యాలయలో కాంట్రాక్ట్‌ టీచర్ల భర్తీ కోసం గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ బట్న కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల గడువు ముగిసిందని, దీంతో నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు చేపట్టి టీచర్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ప్యానెల్‌ సభ్యుడిగా డిప్యూటీ డీఈఓ జాన్‌రెడ్డెప్ప, పరిశీలకులుగా విద్యాలయ నిర్వహణ కమిటీ నామినీ చైర్మెన్‌ శేషు వ్యవహరించారు.

వ్యక్తి దుర్మరణం

అనంతపురం సెంట్రల్‌: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన నారాయణరెడ్డి(45) కొన్నేళ్ల క్రితం పిల్లల చదువుల కోసమని అనంతపురానికి మకాం మార్చాడు. నగరంలోని కోవూరు నగర్‌లో నివాసముంటున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన మిత్రుడు నాగార్జునరెడ్డితో కలిసి రుద్రంపేట వైపు నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతూ 44వ జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై అదుపు తప్పి కిందపడ్డాడు. ఘటనలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పగాయాలతో నాగార్జునరెడ్డి బయటపడ్డాడు. ఘటనపై ట్రాఫిక్‌ సీఐ వెంకటేష్‌ నాయక్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కసాపురంలో 19 నుంచి ఉగాది ఉత్సవాలు

గుంతకల్లు రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి న పోస్టర్లను స్థానిక ఎమ్మెల్యే జయరాం, ఆలయ ఈఓ విజయరాజు గురువారం ఆవిష్కరించారు. 19న గ్రామోత్సవం, పంచాంగ శ్రవణం, 20న రథోత్సవం, 21న లంకాదహనం కార్యక్రమాలు ఉంటాయి. భక్తుల కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement