మత్స్యకార స్కిల్‌ టెస్ట్‌లో ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

మత్స్యకార స్కిల్‌ టెస్ట్‌లో ఘర్షణ

Mar 13 2026 8:58 AM | Updated on Mar 13 2026 8:58 AM

పెనుకొండ రూరల్‌: చేపల వేటకు సంబంధించి గురువారం గొల్లపల్లి జలాశయం వద్ద మత్స్యకారులకు ఏర్పాటు చేసిన స్కిల్‌ టెస్ట్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. వివరాలు.. రొద్దం మండలం తురకలాపట్నం గ్రామ చెరువులో చేపల వేటకు సంబంధించి స్కిల్‌ టెస్ట్‌ను ఆ గ్రామ చెరువులో కాకుండా గొల్లపల్లి జలాశయంలో గురువారం మత్స్యశాఖ అధికారులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. గ్రామ సర్పంచ్‌, చెరువు ఆయకట్టు రైతులకు, గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా, దండోరా వేయించకుండా ఏకపక్షంగా స్కిల్‌ టెస్ట్‌ను మరో ప్రాంతంలో ఎలా నిర్వహిస్తారంటూ మండి పడ్డారు. టీడీపీ వర్గీయులకు వత్తాసు పలకడం సబబు కాదన్నారు. ఆ సమయంలో మరో వర్గం వారు జోక్యం చేసుకుని వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న కియా ఎస్‌ఐ రాజేష్‌, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. కాగా, తాము గ్రామంలోని మత్స్యకారులు, మండల అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చామని జిల్లా మత్స్య శాఖ అధికారి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. హాజరు కాని వారికి మరోమారు స్కిల్‌ టెస్టు నిర్వహిస్తామనడంతో గ్రామస్తులు వెనుదిరిగారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తురకలాపట్నం వాసులు

రొద్దం: తురకలాపట్నం చెరువులో చేపల వేట హక్కు కల్పించే విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు ఆ గ్రామస్తులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ చెరువులో కాకుండా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయంలో అధికారులు స్కిల్‌ టెస్ట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా తమపై దాడికి ఉసిగొల్పారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ గ్రామ చెరువు పెద్దకోడిపల్లి సొసైటీ పరిధిలో ఉండేదని, గ్రామస్తులంతా చందాలు వేసుకుని రూ 5.50 లక్షలు పెద్దకోడిపల్లి సొసైటీకి చెల్లించి తమ చెరువు సొసైటీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. దండోరా వేయించి, తమ గ్రామ చెరువులోనే స్కిల్‌ టెస్ట్‌ ఏర్పాటు చేయించేలా అధికారులను ఆదేశించాలని కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు చంద్రశేఖర్‌, మారుతి, పెద్ద రాజప్ప, మహేష్‌, వెంకటరాముడు, దేవరాజు, ఓబులేసు, ప్రకాష్‌, పెద్దన్న, నారాయణప్ప, వెంకటరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement