ప్రభుత్వ అసమర్థత వల్లే కదిరి ఘటన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అసమర్థత వల్లే కదిరి ఘటన

Mar 13 2026 7:35 AM | Updated on Mar 13 2026 7:35 AM

కదిరి టౌన్‌: ‘‘ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకూ ఎప్పుడూ.. ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినా... చిన్న పొరపాటు కూడా జరగలేదు. కానీ ఈ సారి చంద్రబాబు అసమర్థ పాలనలో రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం చక్రాల కింద ఆరుగురి కాళ్లు నలిగిపోయాయి. అందులో ఒకరి కాలు తీసేయాల్సి వచ్చింది. ఇది ముమ్మాటికీ పాలకుల అసమర్థతే’’ అని వైఎస్సార్‌ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌ అన్నారు. గురువారం ఆయన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ యాక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డితో కలిసి స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఖాద్రీశుని రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని ముందస్తు సమాచారం ఉన్నా... సరైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కదిరి ఘటన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య, అసమర్థతకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఆలయాల అభివృద్ధి, ఆయా ఆలయాల ఔన్నత్యాన్ని కాపాడటం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం.. రద్దీకి తగ్గట్టు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందన్నారు. అందువల్లే రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట ఆలయాల్లో అపశ్రుతులు చోటుచేసుకుంటూ భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

ఈ పాపం మీదే బాబు..

ఖాద్రీశుడి రథోత్సవంలో కాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌, వజ్ర భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. 2026లో తిరువీధులను వెడల్పు చేస్తామని చెబుతున్న టీడీపీ నేతలు... గతంలోనే వైఎస్సార్‌సీపీ సర్కార్‌ కాలేజ్‌ సర్కిల్‌ నుంచి కోనేరు సర్కిల్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడితే అడ్డుకున్నారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనులు ఆపాలంటూ కోర్టులను ఆశ్రయించింది ఎవరో... ఆనాడు అభివృద్ధి పనులను అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఆనాడు టీడీపీ నేతలు విస్తరణ పనులను ఆడ్డుకోకుండా ఉండి ఉంటే నేడు ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావన్నారు. కదిరి రథోత్సవంలో చోటుచేసుకున్న ప్రమాదానికి పూర్తి బాధ్యత టీడీపీనే తీసుకోవాలన్నారు., ఇప్పటికై నా పచ్చ నేతలు స్వార్థ రాజకీయాలు మాని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

అప్పుల్లో నంబర్‌వన్‌..

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం...అప్పుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలిపిందన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టు చేసి జైలుకు పంపించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే రూ.10,330 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో కేవలం రూ.2,766 కోట్లు కేటాయించారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి చెన్నూర్‌ గంగాధర్‌, వైఎస్సార్‌ సీపీ 24వ వార్డు ఇన్‌చార్జ్‌ షామీర్‌ఖాన్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రథోత్సవంలో ఆరుగురు

గాయపడటం బాధాకరం

అభివృద్ధిని విస్మరించిన చందబ్రాబు.. అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు

విలేకరుల సమావేశంలో

బీఎస్‌ మక్బూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement