హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.23,800 ప్రకారం ధర పలికింది. గురువారం మార్కెట్ యార్డుకు 4,954 క్వింటాళ్ల చింతపండు రాగా, అందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.23,800, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికిందన్నారు.
నేడు ఖాతాల్లోకి
‘అన్నదాత సుఖీభవ’ నిధులు
పుట్టపర్తి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి రూ.6 వేలు జమ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 2,65,262 మంది రైతుల ఖాతాల్లో రూ.106.02 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుండగా, పీఎం కిసాన్ కింద 2,46,262 మంది రైతులకు రూ.49.25 కోట్లు జమ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
● జిల్లా కోర్టు సంచలన తీర్పు
కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం: బాలుడి హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించింది. కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం తిప్పనపల్లికి చెందిన గొల్ల ఈరన్న కుమారులు సన్న ఈరన్న, చిత్తప్పలకు భూమి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి. సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్దన్ (11) తన చిన్నాన్న చిత్తప్ప తోటలోకి నీరు తాగడానికి వెళ్లి అక్కడ ఒక మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే విష్ణువర్ధన్‌ను అడ్డగించిన చిత్తప్ప, బాలుడి తాత ఈరన్న, మామ మురుకుందప్పలు ఎందుకు తోటలోకి వచ్చావని ప్రశ్నించారు. తోటలో తనకు కూడా హక్కు ఉందని విష్ణువర్ధన్ అనడంతో కోపోద్రిక్తులైన ముగ్గురూ బాలుడిని కొట్టి, తాడును అతడి మెడకు బిగించడంతో మరణించాడు. అనంతరం అక్కడే ఉన్న టార్ఫాలిన్ పట్టలో చుట్టి గడ్డివాములో దాచిపెట్టి ముగ్గురూ వెళ్లిపోయారు. 2022 సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై బాలుడి తండ్రి సన్న ఈరన్న ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ యువరాజ్ కేసు నమోదు చేయగా.. కళ్యాణదుర్గం సీఐ శ్రీనివాసులు సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసులో తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భీమారావు గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ఏ–1 గొల్ల చిత్తప్పకు రూ.25 వేలు, ఏ–2 గొల్ల ఈరన్నకు రూ.50 వేలు, ఏ–3 మురుకుందప్పకు రూ.10 వేలు జరిమానా విధించారు. జరి మానా కట్టని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


