అగళి: పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఉత్తమ గ్రేడ్, మార్కులు రావాలనే ఆకాంక్షతో సరైన ఆహారం, నిద్రకు కొందరు దూరమవుతుంటారు. చదువు ధ్యాసలో పడి విద్యార్థులు సరిగ్గా తిండి తినకపోతే నీరసించి పరీక్షలు సరిగా రాయలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు పసిగట్టి వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపునకు దోహదపడే ఆహారాన్ని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2,988 విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
25 శాతం ఖాళీ కడుపు ఉండాలి..
ఉదయం కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. అందులో తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఉండేలా చూసుకోవాలి. దోశ, ఇడ్లీ, వడ, ఊతప్పం, పెసరట్టు, వెజిటబుల్ కిచిడి, గోధుమ రవ్వ ఉప్మా వంటివి మంచిది. వీటిలో ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. పల్లి చట్నీ శరీరానికి రక్షణగా పని చేస్తుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. భోజనాన్ని 75 శాతం తీసుకోవాలి. 25 శాతం ఖాళీ కడుపుతో ఉండాలి. ఎత్తు, వయసుకు తగినట్లుగా సమతులాహారం ఉండేలా చూసుకోవాలి. కారం, పులుపు, నూనెలు, మసాల వినియోగం తగ్గించాలి. విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకోటానికి విటమిన్–బీ12 ఉపయోగపడుతుంది. జ్ఞాపశక్తి పెరుగుదలకు ఉపయోగపడే ఈ విటమిన్ మాంసపు ఉత్పత్తుల్లో అధికంగా లబిస్తుంది. మాసంపు తినటానికి ఇష్టపడని వారు రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తినడం మంచిది. మధ్యాహ్నం భోజనంలో ఒక ఆకుకూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
జంక్ ఫుడ్ అసలే వద్దు
సులువుగా జీర్ణమయ్యే ఆహారమే మేలు
పోషక విలువలు ముఖ్యం
జంక్ ఫుడ్ పక్కన పెట్టాలి..
శీతల పానీయాలు, ఐస్‌క్రీంలు, చిప్స్, బర్గర్లు, నూడుల్స్, స్వీట్లు, సమోసాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకునే ఆహారం తీసుకోవాలి. పరీక్షలు పూర్తయ్యేవరకు బయట ఫుడ్ తినకుండా ఉంటే మంచిది. ప్రధానంగా బొబ్బర్లు, ఉడికించిన కోడిగుడ్లు, శనగలు, వాల్‌నట్స్, బాదం, పిస్తా, పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మొలకెత్తిన, నానబెట్టిన గింజలు, చిక్కీలు, నువ్వుల లడ్డు, గుమ్మడి గింజలు, క్యారెట్, బీట్రూట్, నిమ్మరసం, చెరకు రసం, రాగిజావ, అంబలి, కీర దోస, మజ్జిగ తీసుకోవడం మంచిది. పాలిష్ పట్టని బియ్యంతో చేసిన అన్నాన్ని తినడం ద్వారా ఆదుర్దా తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లు తీసుకోవచ్చు. ఈ పదార్థాలు జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి. తాజాపండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. పరీక్షల రోజుల్లో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్ తినకపోవడం ఉత్తమం. డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. అవసరమైతే నిమ్మరసం, మజ్జిగా తీసుకోవాలి.
రాత్రి 7.30 కల్లా భోజనం
ముగించాలి..
ఆహారంతో పాటు నిద్ర కూడా ముఖ్యం
పరీక్షల సమయంలో విద్యార్థులు విపరీతమైన ఒత్తిడి లోనయితే ఇరిటబల్ బవెల్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదముంది. దీని వల్ల మలబద్ధకం, అతిసారం, గ్యాస్, ఉబ్బరం తదితర లక్షణాలతో బాధపడుతూ అసౌకార్యనికి గురవుతుంటారు. ఫలితంగా పరీక్షల్లో రాయాల్సిన అంశాలను మరిచిపోయే ప్రమాదముంటుంది. పోషకాలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. ఆకు కూరలు, ఫ్రూట్ సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడం ఉత్తమం. ముఖ్యంగా 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్ర పోవాలి.
– డాక్టర్ శివానంద, అగళి
రాత్రి భోజనం 7.30 గంటల కల్లా ముగిస్తే చాలా మంచిది.పప్పుకూర,రసం,సాంబారు,పెరుగు,మజ్జిగ ఉండేలా చూసుకోవాలి.నిద్రకు గంట ముందుగా గ్లాసు పాలు తాగడం ఉత్తమం.రాత్రిళ్లు ఎక్కవ సమయం వేచి ఉండవద్దు.సరిపడా కంటికి నిద్ర లేకపోతే అనేక అనర్థాలు తలెత్లుతాయి.కనీసం ఏడు గంటలు నిద్ర పోవడం మంచిది.సీజన్‌లో లభించే పండ్రు,ముఖ్యంగా విటమిన్ సీ ఎక్కవగా లభీంచేవి తీసుకోవడం చాలా మంచిది.


