ప్రశాంతి నిలయం: హిందూపురానికి విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ను కలెక్టర్ శ్యాంప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం హిందూపురంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
కలెక్టరేట్‌లో డైనింగ్ హాల్ ప్రారంభం
ప్రశాంతి నిలయం: సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన అధునాతమైన డైనింగ్ హాల్‌ను గురువారం కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. దీంతో కలెక్టరేట్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి సుధాకర్, ఏఓ సక్సేనా, సర్వే ఏడీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.
కోర్టుల్లో సమస్యల
పరిష్కారానికి కృషి
● సుప్రీం కోర్టు న్యాయమూర్తి కేవీ విశ్వనాథన్
హిందూపురం: స్థానిక కోర్టుల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని న్యాయవాదులకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథ్ భరోసానిచ్చారు. గురువారం హిందూపురానికి విచ్చేసిన న్యాయమూర్తిని న్యాయవాదులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హిందూపురంలోని కోర్టుల్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సత్వర న్యాయ సేవలు అందేలా న్యాయమూర్తుల నియామకం చేయాలని కోరారు. సమస్యలపై జస్టిస్ కేవీ విశ్వనాథ్ సానుకూలంగా స్పందించారు. వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నేరప్ప, న్యాయవాదులు సత్యనారాయణ, ఇందాద్, శివశంకర్, రామిరెడ్డి, సుదర్శన్, కృష్ణమూర్తి, రవిచంద్ర, సుధాకర్, అజేయ్, చంద్రశేఖర్, మహిళా న్యాయవాదులు రసూల్‌బీ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
పన్ను బకాయిలు వసూలు చేయాలి : డీపీఓ
లేపాక్షి: జిల్లాలో రూ.20 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటి వరకూ రూ.11.50 కోట్లు వసూలు చేశారని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సమత తెలిపారు. మిగిలిన రూ.8.50 కోట్లను ఈ నెల 31వ తేదీ లోపు వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పన్ను వసూళ్ల అంశంపై లేపాక్షి మండలంలోని పంచాయితీ కార్యాదర్శులతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఆమె సమీక్షించారు. ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించి రసీదు పొందేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. గడువు లోపు పన్ను చెల్లించకపోతే అపరాధ రుసుంతో పాటు వసూలు చేయాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో ఏ ఒక్కరూ వెనుకబడరాదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
యాడికి: వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిసిన మేరకు.. యాడికి లోని కోట వీధిలో నివాసముంటున్న ఓగేటి నాగరాజు(60) షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం వ్యాధి తీవ్రత కారణంగా దెబ్బతిన్న ఎడమ కాలిలోని రెండు వేళ్లను వైద్యులు తొలగించారు. వారం రోజులుగా వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుండడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన బుదవారం రాత్రి ఎలుకల మందు తాగాడు. గమనించిన బార్య హైమావతి వెంటనే బందువుల సాయంతో అనంతపురంలోని వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు స్పందించక గురువారం ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


