బత్తలపల్లి: కూరగాయల పంటలను సాగు చేయాలనుకున్న ఓ కౌలు రైతు పొలంలో డ్రిప్ పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కేవలం తాను వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడినన్న ఒకేఒక్క కారణంతో ఈ ఘాతుకానికి తెగించారంటూ బాధిత కౌలు రైతు వాపోయాడు. వివరాలు.. పోట్లమర్రి గ్రామానికి చెందిన రైతు ఎరికల భాస్కర్‌కు చెందిన పొలాన్ని అదే గ్రామానికి చెందిన తరిక భాస్కర్ కౌలుకు తీసుకుని బెండ, టమాట, ఇతర కూరగాయల పంటలను సాగు చేసేందుకు దుక్కి చేశాడు. బుధవారం ఉదయం డ్రిప్ పైపులు ఏర్పాటు చేసి, లాడర్‌నూ అమర్చాడు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి 15 పైపులను, డ్రిప్ లాడర్‌ను ధ్వంసం చేశారు. గురువారం ఉదయం పొలానికి వెళ్లిన కౌలు రైతు తరిక భాస్కర్ అక్కడి విధ్వంసాన్ని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యాడు. ఘటనతో రూ.15 వేలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఉద్ధేశపూర్వకంగానే ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడన్న అక్కసు
న్యాయం చేయాలంటూ బాధితుడి వేడుకోలు


