నల్లచెరువు: మండలంలోని చెరువువాండ్లపల్లికి చెందిన నాగార్జునరెడ్డి (45) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కుందేలు వేట కోసమంటూ ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రైతు శ్రీనివాసులు పొలం సమీపంలో నేలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగను గమనించకుండా కాలు పెట్టడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగార్జురెడ్డి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు గాలింపు చేపట్టారు. పొలంలో విగతజీవిగా పడి ఉన్న నాగార్జునరెడ్డిని గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మక్బూల్‌బాషా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
‘ఐ’ జాతీయ సదస్సుకు జేఎన్‌టీయూ సన్నద్ధం
అనంతపురం: ఈ నెల 24, 25 తేదీల్లో జేఎన్‌టీయూ (ఏ) ఇంజినీరింగ్ క్యాంపస్ కళాశాలలోని ఎలక్ట్రికల్ విభాగంలో ఐ (ఈవైఈ)–2026 పేరుతో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు గురువారం ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ ఎక్స్‌పో, హెక్తాన్, పేపర్ ప్రజెంటేషన్, వర్క్ షాప్, టెక్నికల్ క్విజ్, సర్క్యూట్ హంట్, జంక్ టు పవర్, పవర్ కోడ్, పోస్టర్ ప్రజంటేషన్ తదితర అంశాల ప్రాధాన్యతగా సదస్సు జరగనుంది. సదస్సు కన్వీనర్‌గా ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ ఎం.రామశేఖర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ పి.సుజాత, ప్రొఫెసర్ ఆర్.కిరణ్మయి, డాక్టర్ బి.జితేంద్రగౌడ్, డాక్టర్ ఎస్.శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు, మాజీ రిజిస్ట్రార్ వి.శంకర్, ఏఈ శ్యాంబాబు, ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ ఎం.నాగ చైత్ర, ఫిర్దోసి కౌసర్ అహమ్మదీయ, విద్యార్థుల కో–ఆర్డినేటర్లు కె.విజయకుమార్, డి.మోనికా పాల్గొన్నారు.
కారు ఢీ – ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు
ఓడీచెరువు: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... అమడగూరు మండలం జేకేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న వెంకట్రాముడు గురువారం తన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెంగళమ్మ చెరువుకు బయలుదేరారు. ఓడీ చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా గోరంట్ల వైపు నంఉచి కదిరి వైపుగా వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకట్రాముడిని స్థానికులు వెంటనే ఓడీ చెరువులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు.


