అనంతపురం: క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యార్థులకు జేఎన్‌టీయూ (ఏ) రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య సూచించారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటై 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం స్పోర్ట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణయ్య హాజరై, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. సామాజిక నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా ఓ క్రీడలో రాణించాలన్నారు. మెదడు చురుగ్గా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి మాట్లాడుతూ... జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, క్రీడలు ఆడటం ద్వారా గెలుపు కోసం పడే శ్రమను అర్థం చేసుకోవడమే కాకుండా ఓటమిని ధైర్యంగా స్వీకరించే ధోరణి కూడా అలవడుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్‌కుమార్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలైన అధ్యాపకులు, విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లను రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ అందజేశారు. విద్యార్థుల తరఫున స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ మహేంద్ర (సివిల్ విభాగం) పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ బి. జోజిరెడ్డి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.నారాయణరెడ్డి, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, కో–ఆర్డినేటర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య


