వామ్మో చిరుత ! | - | Sakshi
Sakshi News home page

వామ్మో చిరుత !

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

వామ్మ

వామ్మో చిరుత !

కదిరి అర్బన్‌: ఇటీవల చిరుతపులుల సంచారంతో కదిరి నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పశువులపై చిరుతల దాడులు పెచ్చురిల్లుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, గొర్రెల కాపరులు, అడవులకు సమీపంలో ఉన్న స్టోన్‌ క్రషర్‌ యూనిట్ల కార్మికులు మరింతగా భయపడుతున్నారు.

అటవీ శివారు గ్రామాల్లో ఆందోళన

కదిరి నియోజకవర్గంలో ఇటీవల వరుసగా చిరుతల సంచారాన్ని పసిగట్టిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అటవీ శివారు గ్రామాల్లో ప్రజలు చీకటి పడితే ఇళ్లను వదిలి బయటకు రావడం మానేశారు. గత నెల 29న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలోని లఘువమ్మ కొండ వద్ద చిరుతను గమనించిన స్టోన్‌ క్రషర్‌ కార్మికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిరుత తన పిల్లలతో కలిసి వెళ్తున్నట్లుగా ఉన్న పాదముద్రలను గుర్తించారు. అనంతరం ఈ నెల 1న నల్లచెరువు మండలం పోలేవాండ్లపల్లి వద్ద రహదారి దాటుతున్న చిరుతను వాహనదారులు గమనించారు. అలాగే ఈ నెల 6న తనకల్లు మండలం తురకవాండ్లపల్లి సమీపంలో సింగరాతిచెరువు వద్ద గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ ప్రాంతంలో చిరుతతో పాటు దాని పిల్లలు కూడా ఉన్నట్లు గొర్రెల కాపరి గుర్తించాడు.

గిరి ప్రదక్షిణపై ప్రభావం

కదిరి కొండ వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖాధ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఆ పరిసర కొండల్లోనే చిరుత పాదముద్రలు గుర్తించడంతో గిరి ప్రదక్షణ చేసేందుకు భక్తులు వెనుకాడుతున్నారు. కదిరి కొండవద్ద ఉపాధి హామీ కూలీలు సైతం పనులను అక్కడి నుంచి వేరేచోటికి మార్చుకున్నారు. పని ప్రాంతంలో టపాసులను సిద్ధంగా ఉంచుకుంటున్నారు.

చిరుతల భయంతో బెంబేలెత్తుతున్న జనం

ఇప్పటికే మూడు చోట్ల కనపడిన చిరుతలు

చిరుతల కదలికలపై నిఘా

కదిరి నియోజకవర్గ పరిసరాల్లో చిరుతల సంచారంపై నిఘా ఉంచాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గొర్రెల కాపరులు, అటవీ శివారు ప్రాంతాల్లోని క్రషింగ్‌ యూనిట్లలో పనిచేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా ఉండడం, తరచూ శబ్దాలు చేస్తుండడం లాంటివి చేయాలి. చిరుత పాదముద్రలు కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలి.

– గుర్రప్ప,

కదిరి అటవీక్షేత్ర అధికారి

వామ్మో చిరుత ! 1
1/1

వామ్మో చిరుత !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement