పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
ప్రశాంతి నిలయం: జిల్లాలో పశుఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో పశుసంపద, వ్యాప్తిస్తున్న వ్యాధులు, స్థానిక పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఔషధాల జాబితాను తయారు చేయడానికి పశు వైద్యులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకంలో భాగంగా ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు
10 మంది గైర్హాజరు
పుట్టపర్తి అర్బన్: ఇంటర్ (జనరల్) ప్రాక్టికల్స్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. 16 కేంద్రాల్లో జరుగుతున్న ప్రాక్టికల్స్‌కు గురువారం 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 484 మందికి గాను 480 మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్‌కు 535 మందికి గాను 529 మంది హాజరైనట్లు చెప్పారు. వివిధ కారణాలతో ఉదయం, మధ్యాహ్నం సెషన్లు కలిపి మొత్తంగా 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ బోర్డు రాష్ట్ర బోర్డు పరిశీలకులు సౌజన్య, డీఈసీ మెంబర్ రామరాజు, ప్రశాంతి, జయచంద్ర, ప్రశాంత్ తదితరులు ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను పర్యవేక్షించారు.
క్వింటా చింతపండు
రూ.25 వేలు
హిందూపురం: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో చింతపండు విక్రయాలు ఊపందుకున్నాయి. గురువారం మార్కెట్‌కు 1,650 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.15,500, కనిష్టం రూ.6 వేల ప్రకారం ధర పలికిందన్నారు. మార్కెట్‌లో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన ఉత్పత్తులు తీసుకువస్తే మంచి ధరలకు ఉత్పత్తులను విక్రయించుకోవచ్చన్నారు.
పెండింగ్ కేసులపై
దృష్టి సారించండి
● పోలీసులకు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
పుట్టపర్తి టౌన్: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు, నిందితులు అరెస్ట్ గురించి డీఎస్పీ విజయకుమార్‌ను ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఇందుకోసం డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పేకాట, గంజాయి, మహిళా నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్


