ఏసీబీ వలలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి
కదిరి టౌన్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి(ఏబీసీడబ్ల్యూఓ) గుర్రం బాలాజీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బకాయిల మంజూరు కోసం వార్డెన్ నుంచి లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..గాండ్లపెంట మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కోరగా...రూ.18 వేలు లంచం ఇవ్వాలని ఏబీసీడబ్ల్యూఓ గుర్రం బాలాజీ డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మీనారాయణ రూ.15 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా వార్డెన్ గురువారం కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో ఉన్న ఏబీసీడబ్ల్యూఓ నివాసానికి వెళ్లి.. ఆయనకు రూ.15 వేల నగదు అందజేశారు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు బాలాజీని పట్టుకున్నారు. ఈ మేరకు గుర్రం బాలాజీపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ హమీద్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.


