ఎరలతో పురుగులకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎరలతో పురుగులకు చెక్‌

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

ఎరలతో

ఎరలతో పురుగులకు చెక్‌

పుట్టపర్తి అర్బన్‌: వివిధ పంటలను ఆశించే పురుగులతో రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. వాటిని అరికట్టేందుకు వేలాది రూపాయలు వెచ్చించి రసాయనిక మందులు కొనుగోలు చేసి పిచికారీ చేస్తున్నారు. దాని వలన ఆశించిన ఫలితాలు రాకపోగా భూమి కలుషితమవుతోంది. దీంతో రానురాను పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులు రసాయనిక మందులపైనే ఆధార పడకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే స్థిరమైన నాణ్యమైన ఉత్పత్తులు సాధించడానికి వీలవుతుంది. ఈ చర్యల్లో భాగంగా ఎరల వినియోగం గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్‌ రామసుబ్బయ్య చెబుతున్నారు.

లింగాకర్షక ఎరలు..

పంటలపై వాలే మగ రెక్కల పురుగులను సహజంగా ఆడ రెక్కల పురుగులు ఆకర్షిస్తాయి. దీనికి గాను ఆడ రెక్కల పురుగుల తల, రెక్కలు, కాళ్లు, జననాంగాల నుంచి కొన్ని రసాయనాలు విడుదల చేస్తాయి. ఈ రసాయనాలనే కృత్రిమంగా తయారు చేసి లింగాకర్షక ఎరలుగా రూపొందిస్తున్నారు. ఈ ఎరలు ప్రధానంగా మగ రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. వాటిని పాలిథిన్‌ సంచుల్లో గరాటా ఆకారపు పాత్రల్లో ఉంచి పొలం మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో కర్రలు పాతి వాటి చివరన ఎరలను ఉంచుతారు. వాటి ద్వారా మగ పురుగులు వచ్చి సంచుల్లో పడి చనిపోతాయి. వాటి సంఖ్య ఆధారంగా పురుగుల ఉధృతి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు.

దీపపు ఎరలు..

గొంగళి పురుగుల జాతికి చెందిన రెక్కల పురుగులు, కొన్ని రకాల పెంకు పురుగులు పంటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వాటిని నాశనం చేసేందుకు తెల్లని కాంతిని విరజిమ్మే విద్యుత్‌ దీపాలను రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ పొలం మధ్యలో అక్కడక్కడా ఏర్పాటు చేస్తే పురుగులు కాంతికి ఆకర్షితమవుతాయి. లైట్ల కింద క్లోరోఫైరిఫాస్‌, కిరోసిన్‌ లాంటి ద్రావణాలను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, చెరువకులో పీక పురుగు, కాండం తొలిచే పురుగు, కంది, పత్తిలో కాయతొలిచే పురుగు, వేరు పురుగు దీపపు ఎరల చేత ఆకర్షింపబడతాయి. సాగు చేసే పంటను బట్టి 1 ,2 మీటర్ల ఎత్తులో దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. దీపాల వద్దకు చేరుకోగానే రెక్కల పురుగులు విషపు ద్రావణంలో పడిచనిపోతాయి. విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేసుకోలేని రైతులు రాత్రిపూట సామూహికంగా మంటలు వేస్తే రెక్కల పురుగులు అందులోపడి చనిపోతాయి.

ఎర పంటలు..

పురుగుల నిర్మూలనకు ఎర పంటలు కూడా బాగా దోహదపడతాయి. పత్తిలో శనగ పచ్చ పురుగు నివారణకు బెండ, పొగాకు, లద్దె పురుగు నివారణకు ఆముదం మొక్కలు అక్కడక్కడా వేసుకోవాలి. దీంతో ప్రధాన పంటలకు పురుగు తాకిడి తగ్గుతుంది. వేరుశనగకు చుట్టూ నాలుగు సాల్లు జొన్న వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఎర పంటపైనే పురుగు మందును పిచికారీ చేసి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తద్వారా రైతులకు పెట్టుబడులు కూడా తగ్గుతాయి.

పసుపు రంగు ఎరలు..

దోస, కళింగర, పత్తి, వంగ వంటి పంటలను ఆశించే తెల్లదోమ నిర్మూలనకు పసుపు రంగు ఎరలు అధికంగా ఉపయోగపడతాయి. ఈ ఎరలను ఎకరాకు పది ఏర్పాటు చేస్తే మంచిది. ఈ ఎరలకు తెల్ల దోమలు వచ్చి అతుక్కొని చనిపోతాయి. ప్రస్తుతం మామిడి, దోస, కళింగర పంటలు విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ పూత దశలోనూ, పిందె దశలో ఉన్నాయి. వాటికి పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఎరల వాడకంతో మందుల ఖర్చు తగ్గుతుంది.

మామిడిలో బాటిల్లో విషద్రావణంతో

ఎర ఏర్పాటు చేసిన

దృశ్యం

ఎరకు పడి చనిపోయిన దోమలు, పురుగులు

వివిధ పంటలకు పురుగులు

ఆశిస్తుండటంతో తగ్గుతున్న దిగుబడి

ఎరల వాడకంతో ఉత్తమ ఫలితాలు

తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి

ఉత్తమ ఫలితాలు వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు

ఎరలతో పురుగులకు చెక్‌ 1
1/3

ఎరలతో పురుగులకు చెక్‌

ఎరలతో పురుగులకు చెక్‌ 2
2/3

ఎరలతో పురుగులకు చెక్‌

ఎరలతో పురుగులకు చెక్‌ 3
3/3

ఎరలతో పురుగులకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement