ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి
రాప్తాడురూరల్: ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా పరిషత్ ఇన్‌చార్జ్ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. డీడీఓ నాగ శివలీలతో కలిసి బుధవారం అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్‌ఎస్)ను పరిశీలించారు. సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వెంకటసుబ్బయ్య సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి వర్ల శంకర్, పంచాయతీ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ శివ పాల్గొన్నారు.
ఎస్‌డీసీ తిప్పేనాయక్ బదిలీ
● కాకినాడ డీఆర్‌ఓగా నియామకం
అనంతపురం అర్బన్: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ) డి.తిప్పేనాయక్‌ను కాకినాడ డీఆర్‌ఓగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిప్పేనాయక్ ప్రస్తుతం అనంతపురం కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ) ఎస్‌డీసీగా ఉన్నారు.
రస్తా విషయంలో
ఇరువర్గాల ఘర్షణ
గార్లదిన్నె: రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన మండల పరిధిలోని సంజీవపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... యర్రగుంట్ల రెవెన్యూ పొలం సర్వే నంబర్ 26/6లో సంజీవపురానికి చెందిన చితంబరయ్య కుమారులు దివ్యాంగుడు పెద్దన్న, లక్ష్మినారాయణ, శివయ్యలు 8 ఎకరాల పట్టా భూమి సాగు చేసుకుంటున్నారు. బీరప్ప కుమారులు ఎర్రిస్వామి, ఆదినారాయణకు కూడా 3 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇరువర్గాల మధ్య కొంతకాలంగా దారి విషయమై వివాదం నెలకొంది. బీరప్ప కుమారులు ఇటీవల కోర్టు నుంచి శాశ్వత ఇంజెంక్షన్ ఆర్డర్ పొందారు. బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో చితంబరయ్య భార్య కొండమ్మ స్పృహతప్పి పడిపోయింది. ఆదినారాయణ భార్య సరస్వతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి ఇరువురినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాలికను గర్భిణి చేసిన ఆటోడ్రైవర్
గుత్తి రూరల్: ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను గర్భిణిని చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు బాలిక రోజూ ఆటోలో వస్తున్న క్రమంలో డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
శభాష్ వెంకటలక్ష్మి
విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాల పదో తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటింది. తృతీయ స్థానంలో నిలిచింది. వారం క్రితం తమిళనాడులో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్రం తరఫున జట్టులో ప్రాతినిధ్యం వహించిన వెంకటలక్ష్మి అత్యంత ప్రతిభ కనబరిచి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ తులసి విద్యార్థిని అభినందించారు. పేదింట పుట్టినా ఒకవైపు చదువులతో పాటు మరోవైపు క్రీడల్లో కూడా రాణించడం గర్వకారణమన్నారు.
ఆ కానిస్టేబుల్ సస్పెన్షన్
పుట్లూరు: మహిళపై అత్యాచారయత్నం చేసిన యల్లనూరు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ మారుతికుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జనవరి 30న పుట్లూరు మండలంలోని అరకటివేముల గ్రామంలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు మారుతీకుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి


