పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు!
రొద్దం: మండల పరిధిలోని పెద్దకోడిపల్లిలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన యువకుడు లింగమయ్య కేసులో ముగ్గురు నిందితులు పోలీ సుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. గురువారం లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడి ఇంటి వద్ద మృతదేహాన్ని పూడ్చి పెడతారనే సమాచారం రావడంతో సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. లింగమయ్య అంత్యక్రియలు సాఫీగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
హత్యాయత్నం కేసులో
నిందితుడి అరెస్టు
కదిరి టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడిని కదిరి పోలీ సులు అరెస్టు చేశారు. సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. స్థానిక రాజీవ్‌గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న పట్రా చంద్రశేఖర్ కుమారులు పట్రా శివ, పవన్ లు గత ఏడాది ఆగస్టులో అయ్యప్ప గుడి వీధికి చెందిన సాయికిషోర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు యత్నించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పట్లోనే పట్రా పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పట్రా శివకుమార్‌ను రాబడిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి కదిరిలో అరెస్టు చేశారు. బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. గతంలో శివపై 6 కేసులు ఉండడంతో అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు.
ఎద్దు పొడిచి మహిళా
రైతుకు తీవ్ర గాయాలు
గుత్తి రూరల్: గుంతకల్లు మండలంలోని శంకరబండ గ్రామంలో ఎద్దు పొడిచి ఓ మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. శంకరబండ గ్రామానికి చెందిన మహిళా రైతు నారాయణమ్మ పాడితో పాటుగా వ్యవసాయ పనుల కోసం పశువులు కొనుగోలు చేసింది. రోజు మాదిరిగానే బుధవారం ఎద్దులకు మేత పెట్టేందుకు ఇంటి సమీపంలో ఉన్న వామి వద్దకు తీసుకెళ్తోంది. అయితే ఒక ఎద్దు ఒక్కసారిగా బెదురుకొని నారాయణమ్మపైకి దూసుకెళ్లి పైకి ఎత్తి పడేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఎద్దును అదుపు చేసి తీవ్రంగా గాయపడిన నారాయణమ్మను ఆటోలో చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు.
‘దుర్గం’లో దొంగల అలజడి
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు అలజడి సృష్టించారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు సంచరించిన దృశ్యాలు స్థానికంగా ఓ ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారం క్రితం రెవెన్యూ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలోనే మళ్లీ దొంగల సంచారంతో స్థానికులు హడలెత్తుతున్నారు.


