ధర్మవరం రూరల్: ఆరుగాలం కష్టపడి కుటుంబంతో సహా ద్రాక్ష పంటను కంటికి రెప్పలా కాడుకున్నాడు ఆ రైతు. పంట బాగా పండటం..మార్కెట్‌లో మంచి ధర లభిస్తుండటంతో తన కష్టాలన్నీ తీరాయని సంబర పడ్డాడు. అయితే ఆ రైతు ఆశలపై కూటమిలోని ఓ పార్టీ నేతలు నీళ్లు చల్లారు. రైతు పొలానికి వెళ్లే దారిలేకుండా బండరాళ్లు అడ్డువేశారు. మరోమార్గం లేక.. పంట కోసే వీలులేక రైతు అల్లాడిపోతున్నాడు.
ఏళ్ల తరబడి తిరుగుతున్న దారిని మూసి...
ధర్మవరం మండలం నేలకోట తండాకు చెందిన నబావత్ దావురే నాయక్‌కు సర్వేనంబర్ 16–3లో 3.65 ఎకరాల భూమి ఉంది. ఇందులో రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి ద్రాక్ష పంటను సాగు చేశాడు. కుటుంబంతో సహా కష్టపడి పంటను కాపాడుకున్నాడు. దేవుడు కూడా ఆయన కష్టాన్ని చూసి కరుణించడంతో పంట బాగా వచ్చింది. ప్రస్తుతం కోత దశలో ఉంది. మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటంతో రైతు నబావత్ దావురే నాయక్ మూడు రోజుల క్రితం వ్యాపారులు, కూలీలతో కలిసి పంటను కోయడానికి పొలానికి బయలుదేరాడు. అయితే గ్రామానికే చెందిన దేవ్లా నాయక్, చిరంజీవి నాయక్, ప్రతాప్ నాయక్ తదితరులు అతని పొలానికి వెళ్లే దారికి అడ్డుగా బండరాళ్లను వేశారు. ఇది రహదారి కాదంటూ వాహనాలను వెనక్కు తిప్పి పంపారు. అయితే తాను ఏళ్ల తరబడి అదే దారి గుండా పొలానికి వెళ్తున్నానని, తీరా పంట కోసే సమయంలో ఇలా దారి లేదంటూ అడ్డుకోవడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా వారు పట్టించుకోలేదు. ‘‘నీ దిక్కున్న చోట చెప్పుకో...దారి వదిలే ప్రసక్తే లేదు’’ అంటూ రైతును బెదిరించారు. ఓ వైపు పంట కోతకు వచ్చింది...సకాలంలో మార్కెట్‌కు తరలిస్తే కష్టాలన్నీ తీరే అవకాశం ఉంది. కానీ అధికారం అండతో కూటమిలోని ఓ పార్టీ నేతలు అడ్డుకోవడంతో ఏం చేయాలో తెలియని రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇదే విషయాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నాడు. అధికారులు స్పందించి ద్రాక్ష పంటను కోసుకోవడానికి పొలానికి వెళ్లేందుకు దారి చూపాలని కోరుకుంటున్నాడు.
ద్రాక్ష రైతు జీవితంతో
అధికార పార్టీ నేతల ఆటలు
ఏళ్ల తరబడి తిరుగుతున్న రహదారిపై బండరాళ్లు
దారిలేదంటూ పంట కోసేందుకు వెళ్లనీయకుండా ముప్పుతిప్పలు
అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్న బాధితుడు
పండిన ఆశలు.. ‘అధికార’ కుట్రలు
పండిన ఆశలు.. ‘అధికార’ కుట్రలు


