భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం
● లక్షలాది మంది వచ్చినా
సౌకర్యాలు కల్పించాం
● కలెక్టర్ శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఏ ఒక్క భక్తుడికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, అందుకే బాబా జయంత్యుత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న వేడుకలకు ప్రారంభమైనప్పటి నుంచి యంత్రాంగమంతా శత జయంతి ఏర్పాట్లలోనే నిమగ్నమై ఉందన్నారు. ఇప్పటి వరకు 4,24,153 మంది భక్తులు పుట్టపర్తికి విచ్చేశారన్నారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ‘సాయి100’ యాప్‌తో భక్తులకు సకల సమాచారం లభిస్తోందని, అందుకే చాలా మంది యాప్‌ను వినియోగించుకున్నారన్నారు. ఇక రవాణా సౌకర్యార్థం పుట్టపర్తికి 261 బస్సులు ఉచితంగా నడుపుతున్నామని, 14,272 మంది యాత్రికులు రవాణా సేవలను పొందారన్నారు. ప్రశాంతి నిలయంలో 1,92,151 మందికి బస ఏర్పాటు చేశామన్నారు. అలాగే భద్రత కోసం 5,500 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో పట్టణంతో పాటు, విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. సత్యసాయి బాబా జయంత్యుత్సవాలు ముగిసే వరకూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
పుట్టపర్తి : మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 నుంచి 5 వరకూ, రూ.200 రుసుముతో డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు, రూ.500 రుసుముతో అదే నెల 11 నుంచి 15వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్‌పై
కేసు నమోదుకు ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న భూసంరక్షణ విభాగం (సాయిల్ కన్సర్వేషన్) జూనియర్ అసిస్టెంట్ బి.హసీనాపై పోలీసు కేసు నమోదుకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. క్రమశిక్షణా రాహిత్యం, మోసం, చెక్కుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలపై జూనియర్ అసిస్టెంట్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. వివరాలు... ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తమతో హసీనా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు కలెక్టరేట్‌తో పాటు జేడీఏ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్నానంటూ నమ్మించి రూ.లక్షలకు లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల నుంచి ఒత్తిళ్ల పెరగడంతో జూనియర్ అసిస్టెంట్ హసీనా తన కార్యాలయంలో డిపార్ట్‌మెంట్‌కు చెందిన 15 చెక్కులను ఫోర్జరీ చేసి బాధితులకు చూపిస్తూ వస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశాల మేరకు ఈనెల 12న జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసు కేసు నమోదు చేయించాలని ఆ శాఖ డీడీ ఓబుళపతిని ఆదేశించారు. గురువారం ఆయన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు అందించారు. అయితే ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఓ జూనియర్ అసిస్టెంట్ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం, చెక్కులను వాడుకోవడంపై ఆ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం


