మొక్కు‘బడి’ సమావేశాలు
పుట్టపర్తి: పాఠశాలల్లోని సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి విద్యాబోధన సాఫీగా సాగేలా చూడాల్సిన తల్లిదండ్రుల సమావేశాలు మొక్కుబడి తంతుగా మారాయి. ప్రతి నెలా నిర్వహించాల్సిన సమావేశాలను ప్రధానోపాధ్యాయులు పుస్తకాల్లో తమకు తోచింది. రాసేయడం, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులను విడివిడిగా పిలిపించుకొని మినిట్స్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించుకోవడం పరిపాటిగా మారింది. పాఠశాలల్లో ఏం జరుగుతోందో పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండాపోతోంది. పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పత్తా లేకుండాపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
జరక్కపోయినా జరిగినట్లు..
జిల్లా వ్యాప్తంగా సుమారు 90 శాతం పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదని ఉపాధ్యాయ వర్గాలే అంటున్నాయి. కొన్ని పాఠశాలల్లో మూడు, నాలుగు నెలలకోసారి అందుబాటులో ఉన్న కమిటీ సభ్యులను పిలిపించుకొని సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నిబంధన పెట్టింది కాబట్టి తప్పదన్నట్లు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కలసి సమావేశాలు నిర్వహించినట్లు రికార్డులు రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. తామే కొన్ని సమస్యలు అడిగినట్లు నమోదు చేసుకోవడం, చైర్మన్, సభ్యులను విడివిడిగా పిలిపించుకొని సంతకాలు పెట్టించుకోవడం పరిపాటిగా మారిందంటున్నారు. పాఠశాల స్థాయిలో ఎంతో కీలకంగా ఉండాల్సిన సమావేశాలపై నిర్లక్ష్యం చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు ఏం చేస్తున్నారో కూడా అంతుబట్టడం లేదు.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,639
ప్రాథమికోన్నత పాఠశాలలు 83
ఉన్నత పాఠశాలలు 290
మొత్తం విద్యార్థుల సంఖ్య 1,16,613
తల్లిదండ్రుల కమిటీ సమావేశాల్లో
సమస్యలపై చర్చలు జరిపితే ఒట్టు
తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారమూ తెలియని పరిస్థితి
పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎంఈఓలు


