
దొరికేనా ఆ బంగారం?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎస్‌బీఐ (స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో దోపిడీ జరిగి రేపటికి సరిగ్గా నెలరోజులవుతోంది. ఎక్కడా ఆనవాళ్లు కూడా లభించకుండా పదకొండున్నర కిలోల బంగారం, రూ.30 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లడం అప్పట్లో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నుంచి ఇప్పటికీ స్థానికులు తేరుకోలేకపోతున్నారు. చోరీ అయిన బంగారం మొత్తం రైతులు, వివిధ వర్గాలు తనఖా పెట్టిందని తెలిసింది. ఘట నాస్థలిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా లభించిన ఆధారాల మేరకు బిహార్ లేదా ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగలు చేసిన పనిగా గుర్తించారు.
ఒక నిందితుడు చిక్కినా..
కేసు ఛేదనకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులకు నాలుగు రోజుల క్రితం ఒక దొంగ దొరికాడు. అతని నుంచి 2 కేజీల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. కేసులో ఇది కొద్దిగా ఉపశమనం కలిగించే విషయమే అయినా మిగతా తొమ్మిదిన్నర కేజీల బంగారం ఎక్కడుందో తెలియకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు పట్టుబడిన దొంగకు బ్యాంకు దోపిడీలో వాటా చాలా చిన్నదని వెల్లడైనట్లు తెలిసింది. దీంతో అసలు దొంగ కోసం పోలీసులు మళ్లీ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు చెందిన ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. మధ్యప్రదేశ్, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు అనుమానం వచ్చిన ప్రతిచోటా లాడ్జీలు, హోటళ్లలో జల్లెడ పడుతున్నాయి.
చిన్న క్లూ కూడా లేదు
శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు..ముఖ్యమైన దొంగకి సంబంధించి చిన్న ఆధారం కూడా లభించడం లేదు. అపహరించిన బంగారాన్ని ఇప్పటికే ముంబై లేదా బెంగళూరు ప్రాంతాల్లో విక్రయించి ఉంటారని భావిస్తున్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వాడి బ్యాంకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడం.. ఎక్కడా వేలిముద్రలు, పాద ముద్రలు పడకుండా జాగ్రత్త పడడం.. అసలు ఫోనే వాడకపోవడం.. ఎలాంటి వాహనాన్ని వినియోగించకపోవడంతో అతడిని పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది.
ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద దోపిడీ
హిందూపురం బ్యాంకు దోపిడీ కేసును ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద దోపిడీ కేసుగా పోలీసులు చెబుతున్నారు. అనంతపురం నగర శివారులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇటీవల జరిగిన దొంగతనం సొత్తు విలువ రూ.3 కోట్లే. కానీ హిందూపురం బ్యాంకు దోపిడీ కేసులో బంగారం, నగదు విలువ కలిపి రూ.12 కోట్ల వరకూ ఉంటుంది.
సవాలుగా మారిన హిందూపురం బ్యాంకు దోపిడీ కేసు
ఇటీవల ఒక దొంగ అరెస్టు
రెండు కేజీల బంగారం రికవరీ
లభించని మరో నిందితుడి ఆనవాళ్లు
అతని వద్దే తొమ్మిదిన్నర
కిలోల బంగారం