
జీజీ హట్టిలో మళ్లీ అతిసారం
రొళ్ల: మండల పరిధిలోని జీజీ హట్టి గ్రామంలో మళ్లీ అతిసారం కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే నెలలో గ్రామంలో అతిసారం ప్రబలి 45 మంది అస్వస్థతకు గురికాగా, చిన్నారి అమూల్య (11) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మంగళవారం మళ్లీ అతిసారం కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం గ్రామస్తులు నాగదేవత పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో తయారు చేసిన ఆహారం తిని చిక్కమ్మ, తిమ్మరాజమ్మ, మోహిత్, కుమార్ తదితరులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని కుటుంబీకులు మంగళవారం రొళ్ల సీహెచ్‌సీ, మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ షేక్షావలి, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రామరావుతో పాటు డాక్టర్ శివానంద్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అతిసారం లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు.