
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
చిలమత్తూరు : ‘‘ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నాగరాజు యాదవ్ అవినీతి అక్రమాలను తప్పక ప్రజల ముందు ఉంచుతా. ఎక్కడ ఎవరి పేరు మీద పట్టా పొందాడో బయటపెడతా. ఆయన అవినీతిని బయటపెడతాననే నాపై హత్యాయత్నం చేశాడు. అయినా వదిలేది లేదు.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగరాజు యాదవ్‌ను కొత్తచామలపల్లి నుంచి ప్రజలు తరిమేస్తే చిలమత్తూరు వచ్చి స్థిరపడ్డారన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ అధికారాన్ని అనుభవించడమే కాకుండా అవినీతి అక్రమాలు చేశాడన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన నాగరాజు యాదవ్‌కు అనతి కాలంలోనే అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కోడూరు, టేకులోడు, చిలమత్తూరు పంచాయతీల్లో ఆయన భార్య వినోదమ్మ పేరిట ఎన్ని అసైన్డ్ పట్టాలున్నాయో తనకు తెలుసుని, అవి ఎలా సంక్రమించాయని ప్రశ్నించారు. వాటిని బయటకు తీస్తామన్నారు. తన అవినీతి అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే నాగరాజు యాదవ్ తనపై హత్యాయత్నం చేయించారన్నారు.
ఈగవాలినా ఉపేక్షించేది లేదు
పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ గూండాలు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడి చేసి చంపాలని కుట్ర చేసింది కాకుండా.. ఉద్దేశ పూర్వకంగానే తమ ప్రెస్ మీట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై కానీ, కార్యకర్తలపై కానీ ఈగ వాలినా ఉపేక్షించబోమన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉండరన్న విషయం నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఎస్సీ సెల్ నేత చిన్నప్పయ్య మాట్లాడుతూ... కోడూరు పంచాయతీ టీడీపీ నేత బేకరీ గంగాధర్ తమ పార్టీపై, ఎంపీపీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికారంలో ఉంటే పార్టీ పేరు, అధికారం లేకపోతే కులం పేరు వాడుకుంటున్నారని... ఇలాంటి వాళ్లకు తమ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, సర్పంచ్ జయశంకర్‌రెడ్డి, లక్ష్మీపతిరెడ్డి, ఎంపీటీసీ రఘు, మంజునాథరెడ్డి, ఆదినారాయణ, పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల కన్వీనర్ మద్దిపి లక్ష్మీనారాయణ, లక్ష్మీరెడ్డి, షాకీర్, నవాబ్, ఆయూబ్, శ్రీనాథ్, శంకర్‌రెడ్డి, విష్ణు, నంజిరెడ్డి, దాము, గిరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి
నాగరాజు యాదవ్ అవినీతిని బయటపెడతాననే నాపై హత్యాయత్నం