
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
తనకల్లు: రోగులకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన తనకల్లులోని 30 పడకల ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి..వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్య గురించి సూపరింటెండెంట్ విజయ్‌బాబును అడిగి తెలుసుకున్నారు. రోజూ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, మందుల నిల్వ గురించి ఆరా తీశారు. మందుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఆక్సిజన్ ప్లాంట్, లేబరేటరీ, ఎక్స్‌రే, ఆపరేషన్ థియేటర్ గదులను పరిశీలించారు. అలాగే నిర్మాణంలో ఉన్న నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
షెడ్ నెట్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్
మండలంలోని సీఆర్ పల్లి సమీపంలో ఉద్యానశాఖ, ‘సెర్ప్’ ఆధ్వర్యంలో నిర్మించిన షెడ్ నెట్ హౌస్‌ను కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం పరిశీలించారు. అలాగే చౌడేశ్వరీ ఎఫ్‌పీఓ కలెక్షన్ సెంటర్, సోలార్ కోల్డ్ రూంలను పరిశీలించారు. ఎఫ్‌పీఓ ద్వారా మార్కెటింగ్‌ను అభివృద్ధి చేసి ఇక్కడ పండిన కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య ఉన్నారు.
జాతీయ రహదారి పనుల పరిశీలన
గోరంట్ల: మండల పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి సమీపంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను మంగళవారం కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశీలించారు. పనుల పురోగతిని ఎన్‌హెచ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టపర్తి మండలం గువ్వలగట్టపల్లి వద్ద జరుగుతున్న రహదారి పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
తనకల్లులోని 30 పడకల ప్రభుత్వాసుపత్రి తనిఖీ