
అది దొంగ ఓట్ల విజయం
రాప్తాడు రూరల్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో సాధించిన గెలుపు ఓ గెలుపు కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దానిపై పేలాలు ఏరుకున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన పోలీసులు, పోలింగ్ సిబ్బంది అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంటన్లు కూడా కూర్చోనివ్వలేదన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్‌లో దొంగ ఓట్లు వేసిన వేరు అడ్డంగా దొరికిపోయారన్నారు. కలెక్టర్ ఉన్న బూత్‌లోనూ దొంగ ఓట్లు వేశారంటే ఈ ఎన్నికలు ఎంత హీనంగా జరిగాయో అర్థమవుతోందన్నారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేశారనేందుకు ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు, ఫొటోలే నిదర్శనమన్నారు. పోలింగ్ బూత్‌ల్లో చేసిన వెబ్‌కాస్టింగ్, బూత్‌ల బయట సీసీ పుటేజీలు పూర్తి స్థాయిలో ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ఆధారాలు, సాక్ష్యాలను బయటపెట్టినా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. దొంగ ఓట్లు వేసిన వారిని విచారిస్తే ఈ అక్రమాలకు సూత్రధారులు, పాత్రధారులు బయటపడతారన్నారు. ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని హెచ్చరించారు.
హడావుడి కౌంటింగ్ ఎందుకో?
ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయిచిందన్నారు. ఈ నేపథ్యంలో హడావుడిగా పులివెందుల ఫలితాన్ని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైకోర్టు తమకు వ్యతిరేకంగా ఆదేశాలిస్తుందనే భయంతో ఎక్కువ టేబుళ్లు వేసి ఒకే రౌండ్‌లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశారన్నారు. చంద్రబాబుకు నిజంగా అంతటి ప్రజాబలం ఉందనుకుంటే ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే తాజా ఎన్నిక కోసం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాల సమక్షంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
పులివెందుల, ఒంటిమిట్ట
జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీతో
పోలీసులు కుమ్మక్కు
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి