
నిరుపమాన త్యాగధనులు
తిరుగులేని దేశభక్తే తమ ఆయుధంగా పోరాటం సల్పి భరతమాతను దాస్య విముక్తి కల్గించిన వారిలో అనంత వాసులూ ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తిదాయకమైన పోరాటాల ఫలితంగా... నాటి నుంచి నేటి వరకూ వన్నె తగ్గని జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతావని స్వేచ్ఛకు ప్రతిరూపాలుగా నిలిచిన మహనీయులు... స్మారకాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
అనంతపురం కల్చరల్: జిల్లాకు చెందిన కల్లూరు సుబ్బారావు, తరిమెలనాగిరెడ్డి, పప్పూరు రామాచార్యులు, యర్రమల కొండప్ప వంటి వారే కాకుండా సామాన్యులు సైతం నిరుపమాన త్యాగాలతో ఎంతోమంది దేశం కోసం సర్వమూ అర్పించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తిరుగులేని దేశభక్తే తమ ఆయుధంగా పోరాటాల్లో పాల్గొన్నారు. భరతమాతకు దాస్యవిముక్తి కల్గించిన అనంతరం కూడా తమ ఆస్తిపాస్తులను సమాజానికి అందించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారి త్యాగాలకు ఫలితంగా ఊరూరా వారి విగ్రహాలు ఏర్పాటయ్యాయి.
స్వేచ్ఛావాయువులకు సజీవ చిహ్నం
అనంతపురం నగర నడిబొడ్డున నిలువెత్తు రూపంలో కనపించే టవర్ క్లాక్ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వేచ్ఛావాయువులకు సజీవ చిహ్నంగా నిలిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి గుర్తుగా 8 (ఆగస్టు నెల) భుజాలు, 15 (తేదీ) అడుగుల వెడల్పు, 47 (1947) అడుగుల ఎత్తు టవర్‌క్లాక్‌ను నిర్మించారు. 1952లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
సందర్భం : నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం

నిరుపమాన త్యాగధనులు