
ఖైదీ మృతిపై 18న ఆర్డీఓ విచారణ
ధర్మవరం అర్బన్: ఈ ఏడాది జనవరి 14న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం సబ్‌జైల్‌లోని రిమాండ్ ఖైదీ మృతి చెందిన అంశంపై ఈ నెల 18న ఆర్డీఓ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ మహేష్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పామిడి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన కాడింటి కేశవనారాయణ అలియాస్ శివయ్య ఉరఫ్ శ్రీనివాసులు(50) ధర్మవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీ (నం.1254)గా ఉండేవాడు. అనారోగ్యంతో బాధపడుతుండగా సర్వజనాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన అంశంపై విచారణ చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 18న ఉదయం 11గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో విచారణ ఉంటుందని, దీనిపై ఆక్షేపణలున్నవారు అఫిడవిట్ రూపంగా కానీ, ప్రత్యక్షంగా కాని అందజేయాలని ఆర్డీఓ కోరారు.
బంగారు అపహరణపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: బంగారు అపహరణపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మవరంలోని కొత్తపేటకు చెందిన షేక్ మహబూబ్‌జాన్, ఆమె చెల్లెలు రజియాభాను ఈ ఏడాది జూలై 21న నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ ఇంట్లోకి ప్రవేశించి మహబూబ్‌జాన్ మెడలోని బంగారు గొలుసు లాక్కొనేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె గట్టిగా అరవడంతో దొంగ బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని ఉడాయించాడు. బంగారు గొలుసు సగభాగం మాత్రమే ఎత్తుకెళ్లాడు. ఘటనపై బాధితురాలు అప్పటి నుంచి ఎవరిక చెప్పకుండా గురువారం పీఎస్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఎలుగు బంటి దాడి – వ్యక్తికి గాయాలు
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన మాల పెన్నోబులేసుపై ఎలుగుబంటి దాడి చేసింది. గురువారం మధ్యాహ్నం సీతాఫలాలు కోయడానికి సమీపంలోని పొలాల్లోకి వెళ్లిన సమయంలో చెట్ల పొదల మాటు నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. పెన్నోబులేసు గట్టిగా కేకలు పెట్టడంతో చుట్ట పక్కల రైతులు కర్రలతో వచ్చి ఎలుగు బంటిని అదిలించారు. తీవ్రంగా గాయపడిన పెన్నోబులేసును జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు తరలించారు.
భర్త వేధింపులకు గర్భిణి బలి
కళ్యాణదుర్గం రూరల్: భర్త వేధింపులు తాళలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్డులో నివాసముంటున్న నాగరాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె శ్రావణి(24)కి గండ్లప్ప దొడ్డికి చెందిన బోయ శివన్న, కరెమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులుతో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం శ్రావణి మూడు నెలల గర్భిణి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు చెల రేగాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రావణిపై భర్తతో పాటు అత్త, మామ దాడి చేసి, పుట్టింటికి పంపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.