
యథేచ్ఛగా మట్టి తరలింపు
పెనుకొండ రూరల్: ఏపీఐఐసీ కేటాయించిన భూముల నుంచి మట్టి అక్రమ తరలింపులు తారాస్థాయికి చేరుకుంది. కియా పరిశ్రమ రాకతో అమ్మవారిపల్లి, గుట్టూరు ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో వేర్ హౌస్‌లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో పాటు నూతన వెంచర్లూ కోకొల్లలుగా వెలుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూమిని చదును చేసేందుకు కొందరు ఏపీఐఐసీకి కేటాయించిన భూముల నుంచి మట్టిని అక్రమంగా టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కియా పరిశ్రమ నిర్మాణ సమయంలో అదనంగా పొగైన మట్టిని భవిష్యత్తు అవసరాల కోసం ఏపీఐఐసీ భూముల్లోనే అప్పట్లో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా మట్టిని తరలించేస్తున్నారు. ఈ అంశంపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ మాట్లాడుతూ.. మట్టిని తరలించేందుకు తాము ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని పేర్కొనడం గమనార్హం.
కర్ణాటకలో ప్రమాదం..
గలగల వాసి మృతి
గుమ్మఘట్ట: కర్ణాటకలో చోటు చేసుకున్న ప్రమాదంలో గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గలగల గ్రామానికి చెందిన హుస్సేన్, షాహీనా దంపతులకు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు అర్షాద్ (17) కర్ణాటకలోని బట్రల్లిలో ఉన్న తన మేనమామ వద్ద టైల్స్ పరిచే పనిని నేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన బాలుడు.. కర్ణాటకలోని కోనసాగరం వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అర్షాద్‌ను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే కర్ణాటకలోని రాంపుర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆగమేఘాలపై ఆస్పత్రికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని విమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అర్షాద్ మృతి చెందాడు. ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.