
వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు.. వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం: నగరంలోని తపోవనం సర్కిల్ ఏఎస్‌ఆర్ నగర్‌కు చెందిన పురుషోత్తం (40) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కలెక్టరేట్ సమీపంలోని పెన్నార్ భవనం ఎదురుగా పెయింట్ షాపు నిర్వహిస్తున్న పురుషోత్తం కొంత కాలంగా భార్యకు దూరంగా ఉంటూ తొమ్మిదేళ్లుగా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన సచివాలయ మహిళా పోలీసుతో కొంత కాలంగా సహజీవనం సాగిస్తున్నాడు. వ్యాపారం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో కొనుగోలు దారులు సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.20 లక్షలు చేరుకుంది. ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో మనస్తాపం చెందిన పురుషోత్తం గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.