
29 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వరుసగా మూడో రోజూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 29 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా తాడిమర్రి మండలంలో 56.2 మి.మీ, తలుపుల మండలంలో 54.6 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక ముదిగుబ్బ మండలంలో 48.6 మి.మీ, గాండ్లపెంట 48.2, చిలమత్తూరు 39.6, పరిగి 35.4, కదిరి 31.2, ఎన్‌పీ కుంట 26.2, తనకల్లు 18.6, నల్లచెరువు 17, గోరంట్ల 15.2, పెనుకొండ 14.4, హిందూపురం 14.2, సోమందేపల్లి 13, అమడగూరు 11.8, మిగతా మండలాల్లో 10 నుంచి 3.2 మి.మీ మధ్య వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలపారు.
సికింద్రాబాద్– మైసూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: సికింద్రాబాద్–మైసూర్ మార్గంలో ఈ నెల 8 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ జంక్షన్ (07033) నుంచి సోమ, శుక్రవారాల్లో రాత్రి 10.10 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటలకు మైసూర్ జంక్షన్‌కు చేరుకుంటుందన్నారు. మైసూర్ జంక్షన్ (07034) నుంచి మంగళ, శనివారాల్లో సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుతుందన్నారు. బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగుళూరు కంటోన్మెంట్, బెంగుళూరు జంక్షన్, కెనిగేరి, మండ్య మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 2టైర్, 3టైర్, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయన్నారు.
జీతాలు చెల్లించండి మహాప్రభో
పుట్టపర్తి టౌన్: నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కొత్తచెరువులోని సత్యసాయి పంప్ హౌస్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జిల్లాలోని వెయ్యి గ్రామాల్లోని 10 లక్షల మంది ప్రజలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 540 మంది కార్మికులు నీటిని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో పైప్‌లైన్ దెబ్బతిన్న ప్రతిసారీ సొంత డబ్బు వెచ్చించి మరమ్మతులు చేశామన్నారు. అయినా తమకు వేతనాలు అందజేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించాడంటూ వాపోయారు. ఫలితంగా కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 14 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వెంటనే నిధులు విఽడుదల చేసి 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, పథకం నిర్వహణకు పూర్తి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.

29 మండలాల్లో వర్షం