ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం
● కూటమి సర్కారు తీరుతో అభద్రతలో ఉద్యోగులు
● ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరమైన సమస్యలు అటుంచి ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పీఆర్‌సీ కమిషన్ నియమించలేదన్నారు. దీంతో ఉద్యోగులకే నష్టమని, పీఆర్‌సీ బకాయిలు పెండింగ్‌లో పెడతారన్నారు. 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల దాటితో మరో డీఓ వచ్చి కలుస్తుందని, ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారన్నారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు క్రమంలో అప్పటి తహసీల్దారు తాతారావుపై కోర్టు చర్యలు తీసుకుందని, డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు ఆయన పనిచేశారని, అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పనిచేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఒక నిర్ణయంపై అధికారులు లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామన్నారు. తహసీల్దారు కార్యాలయాల నిర్వహణకు, ప్రోటోకాల్‌కు రూ. లక్షలు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కోర్టు కేసులకు లీగల్ చార్జీలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో తెల్లకాగితాలు కూడా సొంత డబ్బుతో కొనాల్సి వస్తోందన్నారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందని, ఉన్నతాధికారులు తమ నిర్ణయాలను కిందిస్థాయి అధికారులపై రుద్దుతున్నారన్నారు. రెవెన్యూలోని అన్ని కేడర్‌లలో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, కార్యదర్శి సోమశేఖర్, మహిళ విభాగం చైర్‌పర్సన్ సురేఖరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప పాల్గొన్నారు.


