సర్దుకుపోతే మంచిది | Sakshi
Sakshi News home page

సర్దుకుపోతే మంచిది

Published Fri, May 31 2024 12:28 AM

సర్దు

చిలమత్తూరుకు చెందిన 20 ఏళ్ల యువతికి కర్ణాటకలోని బాగేపల్లి వాసితో వివాహమైంది. ఆరు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ తర్వాత తరచూ గొడవలు పడుతూ కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చి కోర్టు మెట్లెక్కారు.

పెనుకొండకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు బెంగళూరులో ఓ మహిళతో వివాహమైంది. పెళ్లయిన పది రోజులకే అతనికి ఇంకో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సదరు మహిళ పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కింది. ఇరు పక్షాల కుటుంబ సభ్యులు కలిసి సర్ది చెప్పినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

పుట్టపర్తి మండలం జగరాజుపల్లికి చెందిన యువకుడికి అదే గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. అయితే ఆ మహిళ అదే గ్రామంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఆమె నుంచి విడాకులు కావాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.

సాక్షి, పుట్టపర్తి : ‘పెళ్లంటే నూరేళ్ల పంట’... మన పెద్దలు చెప్పిన ఈ నానుడి ప్రస్తుత కాలంలో అపహాస్యమవుతోంది. పట్టుమని ఏడాది కూడా కాపురాలు సాగట్లేదు. ప్రస్తుత హైటెక్‌ యుగంలో వేగంగా సాగిపోతోన్న కాలంలో వివాహ బంధం కూడా వేగంగా విడిపోతోంది. పెళ్లయిన మొదటి రోజు నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్న వారు ఎంతో మందే ఉన్నారు. మరికొందరు పిల్లలు పుట్టినా.. కలిసి ఉండలేక వేర్వేరుగా జీవితం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విభేదాలకు సంబంధించి కొందరు ఎస్పీ కార్యాలయంలో ‘స్పందన’ను ఆశ్రయించారు. మరికొందరు విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కుతున్నారు.

వివాహేతర సంబంధాలతోనే..

భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరక.. సర్దుకుపోయే గుణం తెలియక.. పెద్దల మాట లెక్క చేయక.. ప్రతి వారం పది జంటలు చొప్పున పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని.. కలిసి ఉండలేమని.. వేరుగా జీవించేందుకు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భార్య లేదా భర్త.. అవతలి వ్యక్తిపై చేసే ఫిర్యాదులో కచ్చితంగా మరొకరితో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులను స్థానిక పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేస్తున్నారు. కొందరు సర్దుకుని కాపురం చేసేందుకు అంగీకరించినా.. మరికొందరు మాత్రం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.

ఇబ్బడి ముబ్బడిగా..

ఎన్నికల కోడ్‌ ముందు వరకూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’కు సగటున 80 – 100 వరకూ ఫిర్యాదులు వచ్చేవి. ఇందులో 20 శాతం ఫిర్యాదులు కుటుంబ సమస్యలే ఉండేవి. మిగతా అర్జీల్లో రెవెన్యూ, రస్తా సమస్యలు, ఉద్యోగాల పేరుతో నగదు దోపిడీ, ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాలు, వ్యవసాయ, విద్య, వైద్యం, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌, సచివాలయ వ్యవస్థ తదతర అంశాలపై ఉంటాయి. పోలీసు కార్యాలయానికి మార్చి చివరి వారానికి మొత్తం 3,096 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కుటుంబ కలహాల కేసులు 513 ఉన్నాయి.

అనాలోచిత నిర్ణయంతో..

తెలిసీ తెలియని వయసులో ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక , ఆలోచించే పరిపక్వత లేక చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్త దాంపత్య జీవితంలోకి ఇష్టంగా అడుగు పెట్టినా.. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుని గొడవ పడుతున్నారు. ఆలోచన లేని ఆవేశంతో భార్యాభర్తలు విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. వివాదాలపై మొదట పెద్దలకు చెప్పి.. పంచాయితీలు చేసినా ఎక్కువ భాగం సర్దుకుపోవడం లేదు. ఆ తర్వాత దిశ పోలీస్‌స్టేషన్లు, గృహ హింస చట్టం కింద కేసుల నమోదు, అనంతరం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్లి విడిపోయే వరకూ వస్తున్నారు.

భార్యాభర్తల మధ్య విడాకుల చిచ్చు

కొంప ముంచుతున్న వివాహేతర సంబంధాలు

చిన్న,చిన్న విషయాలకే మరికొందరు దూరం

గ్రామస్థాయి నుంచి రచ్చకెక్కుతున్న కేసులు

ప్రతి మనిషికీ తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. అప్పుడే వారికి కలిగే చిన్న చిన్న సమస్యలను తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. పెద్దలకు తెలియకుండానే.. ఏమనుకుంటారనో.. ఏమైనా చేస్తారనేమోనన్న భయం వీడి కుటుంబ పెద్దలకు సమస్య చెప్పి.. ఇంట్లోనే సర్దుకుంటే దంపతుల మధ్య సమస్యలు ఉత్పన్నం కావు. విడాకుల వరకూ వెళ్తే పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. – ఎస్‌వీ మాధవ్‌రెడ్డి, ఎస్పీ

సర్దుకుపోతే మంచిది
1/1

సర్దుకుపోతే మంచిది

Advertisement
 
Advertisement
 
Advertisement