
యువకుడి ఆత్మహత్య
రొద్దం: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రొద్దంలోని పాత ఎస్సీ కాలనీకి చెందిన చంద్రమోహన్ (30)కు బార్య గంగరత్నమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న చంద్రమోహన్ గురువారం వేకువజామున నొప్పి తీవ్రత భరించలేక ఇంటి సమీపంలో ఉన్న చింత చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రైలు ఢీకొని వృద్ధురాలి మృతి
పెనుకొండ రూరల్: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం కొండంపల్లికి చెందిన మంగమ్మబాయి (83)కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వయస్సు పైబడడంతో చెవులు సక్రమంగా వినిపించక బాధపడుతున్న మంగమ్మ బుధవారం మధ్యాహ్నం తర్వాత బహిర్భూమికని గ్రామ శివారులోని రైలు పట్టాల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే కీ మెన్ సమాచారంతో గురువారం ఉదయం హిందూపురం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మురళి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రైతు అనుమానాస్పద మృతి
పావగడ: తాలూకాలోని వైఎన్ హోసకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మేగలపాళ్యం తండా గ్రామానికి చెందిన రైతు స్వామి నాయక్ (40) దాబాస్ పేటె తాలుకా బిల్లినకోటె గ్రామంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం రెండు మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. తీవ్ర వర్షాభావం కారణంగా పంటలు పండక అప్పులు తీర్చలేకపోయాడు. ఈ క్రమంలో మైక్రో సంస్థల ఒత్తిళ్లను తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న తహసీల్థార్ సంతోష్‌కుమార్ కుటుంబసభ్యులతో విచారణ చేపట్టారు. కాగా, 15 సంవత్సరాల క్రితం స్వామి నాయక్ గ్రామం వదిలి వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య