కణేకల్లు: చదువుకునే వయసులో ప్రేమ సరైంది కాదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన కె.వర్షిత (17) మండల కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో తాను ఆశించిన మేర మార్కులు రాకపోవడంతో ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఫిజిక్స్ పరీక్ష రాసి ఇంటికెళ్లింది. అప్పటికే కొంత మంది ద్వారా కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. బుద్దిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కెమిస్ట్రీ పరీక్ష రాసేందుకు కుమార్తె సిద్ధమవుతుండగా గమనించిన తల్లిదండ్రులు ఏ పరీక్ష రాయొద్దని, కళాశాల తెరిచే వరకూ కణేకల్లుకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. దీంతో స్నానం చేసి వస్తానంటూ బాత్‌రూంకు వెళ్లిన వర్షిత.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ ఆమె బయటికు రాకపోవడంతో తల్లిదండ్రులు బాత్‌రూం తలుపు బద్దలుకొట్టి చూశారు. అప్పటికే విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను గమనించి, విషయం పోలీసులకు తెలిస్తే పరువు పోతుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికెళ్లి ఆరా తీయడంతో మొత్తం విషయం వెలుగు చూసింది. ఇన్‌చార్జ్ వీఆర్వో దామోదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కాగా, వర్షిత ఆత్మహత్య విషయం తెలియగానే కణేకల్లు కాలేజీలో ఫస్ట్ ఈయర్ చదువుతున్న ఓ విద్యార్థి సైతం యర్రగుంట వద్ద ఉదయం 11.50 గంటలకు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. రోడ్డు పక్కన అపస్మారకస్థితిలో పడి ఉన్న విద్యార్థిని స్థానికులు గుర్తించి కణేకల్లుక్రాస్‌లోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు సూచన మేరకు కుటుంబసభ్యులు బళ్లారికి తీసుకెళ్లారు.
ప్రేమ వ్యవహారమే కారణం
విషయం తెలిసి మందలించిన తల్లిదండ్రులు
ప్రియురాలి మృతితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం