
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు
బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ధర్మవరంలో
ఒకరు, జీవితంపై విరక్తితో మరొకరు
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
ధర్మవరం అర్బన్/పుట్టపర్తి టౌన్: ధర్మవరంలోని గుట్టకిందపల్లి సమీపంలో పవర్‌లూమ్స్ మగ్గాల యజమాని శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన వరప్రసాద్(30) బీటెక్ పూర్తి చేసి పవర్‌లూమ్స్ మగ్గాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉత్పత్తి చేసిన చీరలు అన్‌సీజన్ కారణంగా అమ్ముడు పోక నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన వరప్రసాద్ శుక్రవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య మమత, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
● పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్ సమీనంలో హరినాథ (26) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం డివిజన్ రైల్వే ఎస్‌ఐ బాలాజీనాయక్ తెలిపిన మేరకు... కొత్తచెరువులోని బీసీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకట్రాముడు దంపతుల కుమారుడు హరినాథ్(26) కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే మతిస్థిమితం కోల్పోయిన ఆయన శుక్రవారం ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టనట్లు రైల్వే పోలీసులు తెలిపారు.