
అతిసారం నివారణకు చర్యలు చేపట్టాలి
రొళ్ల: గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆరోగ్య, పంచాయతీ రాజ్‌శాఖ సిబ్బందికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మంజువాణి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి విజయ్‌కుమార్ సూచించారు. రొళ్ల మండలం కాకి గ్రామంలో అతిసార ప్రబలి నాలుగు రోజులుగా 30 మందికి పైగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి, చికిత్సలు అందజేశారు. శుక్రవారం ఉదయం డీఎంహెచ్‌ఓ, డీపీఓ కాకి గ్రామాన్ని సందర్శించారు. మరింత వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. రక్షిత మంచినీటి కొళాయిలు, ట్యాంకుల శుభ్రం, పైప్‌లైన్ లీకేజీ వంటి సమస్యలపై ఆరా తీశారు. వాంతులు, విరేచనాలు ఉధృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై చైతన్య పరచాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో వాటర్ స్కీమ్ పథకం కింద వచ్చే నీటిని కాకుండా మండల కేంద్రం నుంచి శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికీ రోజుకు 80 లీటర్ల చొప్పున ఐదారు రోజుల పాటు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. వ్యాధి తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ఇంకా రెండు మూడు రోజుల పాటు వైద్య శిబిరాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, వైస్ సర్పంచ్ రాజు, జేసీఎస్ మండల కన్వీనర్ లోకేష్, నాయకులు బసవరాజు, యర్రగుంటప్ప, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మనునాయక్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ప్రసాద్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ తస్లీమ్, డాక్టర్ సౌందర్య, పీహెచ్‌ఎన్ సుధారాణి, ఈఓఆర్డీ క్రిష్ణప్ప, ఇన్‌చార్జ్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విజయ్, ఎంపీహెచ్‌ఈఓ ఖాదర్‌వలి, కార్యదర్శులు శ్రీనాథ్, రచన, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మంజువాణి,
డీపీఓ విజయ్‌కుమార్