
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
అనంతపురం కల్చరల్: కొందరు పుట్టుకతోనే గొప్పవాళ్లుగా ఉంటారు. మరికొందరికి ఈ లోకం గొప్పతనాన్ని ఆపాదిస్తుంది. ఈ రెండో కోవలో చాలా కొద్ది మంది మాత్రమే తమదైన వ్యక్తిత్వంతో గొప్పవారవుతారు. ‘అనంత’ త్యాగధనుడు కల్లూరు సుబ్బారావు నిస్సందేహంగా ఈ కోవకు చెందినవారే. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి 1928 నవంబర్‌లో నంద్యాలలో జరిగిన సభలో దత్తమండలాలకు రాయలసీమని పేరు పెట్టిన వారిలో కల్లూరు సుబ్బారావు ప్రముఖులు. నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ వంటి ఎందరో కల్లూరి సుబ్బారావు స్పూర్తితో ఆయన శిష్యులుగా జాతీయ స్థాయిలో రాణించారు. అనంత అభివృద్ధి కోసం పరితపించిన ఆయన 1937లో రాయలసీమ వారికి అన్యాయం జరగకుండా ‘శ్రీబాగ్ ఒడంబడిక’పై సంతకం చేశారు. స్వాతంత్య్రానంతరం ఎంతో విలువైన తన సొంత స్థలాన్ని కళాకారుల కోసం ( ప్రస్తుతం లలితకళాపరిషత్తు ) విరాళంగా ఇచ్చేశారు. 1967లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. త్యాగానికి ప్రతిరూపంగా నిలచిన కల్లూరు సుబ్బారావు 1897, మే 25న హిందూపురం సమీపంలోని కల్లూరు గ్రామంలో జన్మించారు. 1973లో కన్నుమూశారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా అందించే ‘కల్లూరు సుబ్బారావు అవార్డును’ ఈ ఏడాది సామాజిక సేవా కార్యకర్త తరిమెల అమరనాథరెడ్డికి అందజేయనున్నారు. కల్లూరు వారి ఆదర్శప్రాయ జీవితానికి మరింత ప్రాచూర్యం కల్పించేలా జయంతి, వర్దఽంతులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎల్కేపీ అధ్యక్ష, కార్యదర్శులు గాజుల వెంకట సుబ్బయ్య, పద్మజ తెలిపారు.
సమాంతరంగా మానవత..
రక్తదాతగా, సీనియర్ రచయితగా జిల్లాకు చిరపరిచితులైన తరిమెల అమరనాథరెడ్డి ఆదర్శప్రాయ సేవాతత్పరుడిగా పేరు గడించారు. దేవుడిపై నమ్మకం తప్పు కాదు కానీ భగవంతుని పేరుతో సాగే దోపిడీకి వ్యతిరేకంగా పలు ఉద్యామాలు చేపట్టారు. ‘మానవతా సంస్థ’ను ఏర్పాటు చేసి రక్తదానంపై ప్రజలను నిత్య చైతన్యం చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు ఆదర్శ వ్యక్తిత్వం తనను కట్టిపడేసిందని చెప్పే ఆయన... కల్లూరు పురస్కారానికి తన ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.
నేడు ఎల్‌కేపీలో పురస్కార ప్రదానం..
అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో శనివారం సాయంత్రం కల్లూరు సుబ్బారావు జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. కల్లూరు సుబ్బారావు పేరిట పురస్కారాన్ని తరిమెల అమరనాథరెడ్డికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అందజేయనున్నారు. ఈ సందర్భంగా లలితకళాపరిషత్తు కళాకారులు ‘శ్రీకృష్ణ రాయబారం’ పౌరాణిక నాటకాన్ని సీనియర్ నటులు సోమిరెడ్డి, రామాంజనేయులు ప్రదర్శించనున్నారు.
సందర్భం : నేడు కల్లూరు సుబ్బారావు జయంతి