
ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను తెరపై తిలకిస్తున్న అధికారులు, ప్రతినిధులు
పుట్టపర్తి అర్బన్: ఎన్నికల విధుల్లో 12 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని, వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన డీఆర్‌ఓ కొండయ్య, ధర్మవరం ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డితో కలిసి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాలు నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈనెల 18 తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. మే 4, 5 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. మే 7, 8 తేదీల్లో ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అత్యవసర సేవల పోలింగ్ సిబ్బందికి మే 8న శిక్షణ ఇవ్వాలన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు వయస్సు పైబడిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారన్నారు. పూర్తిగా మంచంపైనే ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్న వారు ఇంటి నుంచే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 20వ తేదీలోపు అన్ని నియోజకవర్గాల నుంచి ఎన్నికలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తనకు అందజేయాలన్నారు. ఈనెల 24, 25 తేదీల్లో ఎన్నికల పరిశీలకులు జిల్లాలో పర్యటించనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీ విజిల్, సోషల్ మీడియా ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తున్నారు..? కోడ్ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎంఎస్, వాట్సాప్, సీ విజిల్, 1950 కాల్ సెంటర్లకు వస్తున్న ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. నగదు, మద్యం, ఇతర సామగ్రి తరలింపుపై నిఘా ఉంచాలన్నారు. వీసీలో జేసీ అభిషేక్‌కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి, కదిరి, ఆర్డీఓలు భాగ్యరేఖ, సన్నీ వంశీకృష్ణ, మడకశిర అధికారి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
శిల్పారామం క్యాలెండర్ల ఆవిష్కరణ..
శిల్పారామం ఆధ్వర్యంలో రూపొందించిన ఉగాది తెలుగు క్యాలెండర్లను శుక్రవారం కలెక్టర్ అరుణ్‌బాబు ఆవిష్కరించారు. ఈ ఏడాదిలో శిల్పారామంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు, శిల్పారాంలోని వసతులు, చూడదగిన ప్రదేశాల గురించి తెలియజేస్తూ క్యాలెండర్‌ను తయారు చేశారు. కార్యక్రమంలో శిల్పారామం ఏఓ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి..
సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈఎంఎస్ 2.ఓ వెబ్‌సైట్ ద్వారా ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలు, సెంట్రల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్‌లను పరిశీలించారు. ఈవీఎం పనితీరుపై సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, ధర్మవరం ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి వేణుగోపాల్‌రెడ్డి, సీపీఎం ప్రతినిధి ఇంతియాజ్, బీజేపీ నుంచి అమర దేవేంద్ర, బీఎస్పీ నాయకులు సుబ్బరాయుడు, దండు నాగరాజు, పెద్దన్న, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ఎన్నికల విధులకు
గైర్హాజరైతే సస్పెండ్ చేస్తా
కలెక్టర్ అరుణ్‌బాబు