
ఒక్కటైన దంపతులతో న్యాయవాదులు
హిందూపురం అర్బన్: ఇద్దరూ ప్రభుత్యోగులే అయినా వివాహమైన కొంత కాలానికే విభేదాలు చోటు చేసుకుని వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఆ తర్వాత భార్య కావాలని భర్త, తనకు భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. చివరకు న్యాయవాదులు, కుటుంబసభ్యుల కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. వివరాలు... హిందూపురం మండలం చౌళూరు గ్రామానికి చెందిన నేత్రావతి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమెకు చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ జీపీ సూరితో కుటుంబ పెద్దలు పెళ్లి నిశ్చయం చేసి 2020, జూన్ 10న వేడుకగా వివాహం జరిపించారు. కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారంలో తర్వాత విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో నేత్రావతి పుట్టింటికి చేరుకుంది. సూరి సైతం చైన్నెలోని తన బెటాలియన్‌లో విధుల్లోకి చేరి పోయారు. ఆ తర్వాత విడాకులు కోరుతూ భార్య కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో తనకు భార్య కావాలంటూ భర్త సైతం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇద్దరూ క్రమం తప్పకుండా వాయిదాలకు హాజరవుతూ వచ్చారు. ఆ సమయంలో ఇద్దరూ కలసి మాట్లాడుకుంటూ ఒకరి గురించి మరొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే న్యాయవాదులు, కుటుంబసభ్యులు నచ్చచెప్పడంతో ఇద్దరూ ఒక్కటయ్యేందుకు అంగీకరించారు. దీంతో శుక్రవారం ఉదయం ఇందిరా పార్క్‌లోని గణేష్ విగ్రహం ఎదుట న్యాయవాదులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఇకపై సఖ్యతగా ఉంటామని ప్రమాణం చేశారు. దంపతులు ఒక్కటవ్వడంతో న్యాయవాదులు, ఇరువైపులా కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రచారాస్త్రం
కదిరి: అభివృద్ధి, సంక్షేమమే తమ ఎన్నికల ప్రచార అస్త్రమని వైఎస్సార్‌సీపీ కదిరి ఎన్నికల ఇన్‌చార్జ్ పూల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, బీసీ సెల్ రాష్ట్ర నేత బత్తల హరిప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి వేమల ఫయాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు 99.95 శాతం నెరవేర్చారని గుర్తు చేశారు. వలంటీర్ వ్యవస్థను తప్పుబట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వలంటీర్ల వేతనాన్ని పెంచుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కదిరిలో మక్బుల్ అహ్మద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని హ్యాట్రిక్ విజయం సాధిస్తామని పూల శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పూలను నియమించడం పట్ల మక్బూల్‌తో పాటు ఇతర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నజీమున్నీసా సాదిక్, వైస్ చైర్మెన్ రాజశేఖర్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గోపాలక్రిష్ణ, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
2,380 చీరలు సీజ్
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 2,380 చీరలను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ గురు ప్రసాదరెడ్డి తెలిపారు. శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో గుంతకల్లు నుంచి కర్ణాటకలోని హసన్‌కు వెళుతున్న బొలెరో పికప్ వాహనంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా చీరలు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో చెక్‌పోస్టు పోలీసులు వాహనంతో పాటు చీరలను సీజ్ చేశారు.

మక్బూల్, నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న పూల శ్రీనివాసరెడ్డి