వారం రోజుల్లో నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో నామినేషన్లు

Apr 12 2024 12:25 AM | Updated on Apr 12 2024 12:25 AM

పార్లమెంట్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేసే కలెక్టరేట్‌   - Sakshi

పార్లమెంట్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేసే కలెక్టరేట్‌

పుట్టపర్తి అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో వారం రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్ల దాఖలు చేయవచ్చు.

ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్లకు అవకాశం

అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఆయా ఆర్‌ఓ, ఆర్డీఓ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి. పార్లమెంట్‌ అభ్యర్థులు కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ప్రతి అంశాన్ని పక్కాగా పరిశీలించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు డమ్మీ సెట్‌ దాఖలు చేయనున్నారు. మొత్తమ్మీద ఒక అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడానికి వీలుంది.

ఎంపీ అభ్యర్థికి రూ.25 వేలు,

ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10 వేలు..

పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసే సాధారణ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావత్తు చెల్లించాలి. ఇక అసెంబ్లీకి పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేల చొప్పున ధరావత్తు చెల్లించాలి. అసెంబ్లీ అభ్యర్థులు ఫారం 26లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా... పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసే వారు ఫారం 26–ఏలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫారాన్ని నామినేషన్‌ రోజు సాయంత్రం 3 గంటల్లోపు అందజేయాలి. ఎన్నికల్లో ‘సువిధ’ యాప్‌లో దాఖలు చేసిన అనంతరం హార్డుకాపీలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులకు మాత్రమే ఛాంబర్‌లోకి అనుమతిస్తారు.

నామినేషన్ల పరిశీలన..

అసెంబ్లీ, పార్లమెంట్‌కు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను 26వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకూ పరిశీలిస్తారు. సరైన నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లు అదే రోజు ప్రకటిస్తారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఏదైన అనివార్య కారణాలతో తమ నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు ఈనెల 29 సాయంత్రం వరకూ గడువు ఉంటుంది. ఇక మే నెల 13వ తేదీ సోమవారం పోలింగ్‌ ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి క్యూలో ఉన్న ఓటర్లు మొత్తం ఓటు వేసే వరకూ సమయం ఉంటుంది. అంతకు ముందు రోజు ఆయా నియోజక వర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే అధికారులు పోలింగ్‌ సామగ్రిని ప్రత్యేక బందోబస్తు మధ్య బస్సుల్లో తరలిస్తారు. జూన్‌ 4వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తానికి జూన్‌ 6వ తేదీ నాటికి ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది.

18 నుంచి 25 వరకూ నామినేషన్ల పర్వం

29 సాయంత్రం వరకూ

విత్‌డ్రాకు గడువు

ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement