
కుల గణనపై మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్‌బాబు
పుట్టపర్తి అర్బన్: ఆర్థిక అసమానతలు తగ్గించడం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో వివిధ కుల సంఘాలు, ఎన్జీఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఈనెల 27 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకూ కుల గణన సాగుతుందన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి వివరాలన్నీ పక్కాగా నమోదు చేయాలన్నారు. అలాగే అన్ని కులాల ప్రజలు సర్వే సిబ్బందికి పూర్తిగా సహకరించాలన్నారు. కుల గణన చేపట్టే రోజున ఆ గ్రామంలో దండోరా వేయిస్తామని, అలాగే ముందురోజే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి తెలియజెబుతారన్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కుల గణన చేస్తారన్నారు. సమాచారాన్ని ప్రత్యేక మొబైల్ యాప్‌లో పొందుపరుస్తారని వెల్లడించారు. అలాగే కుల గణనలో పాల్గొనే సచివాలయ సిబ్బందికి గడువులోపు శిక్షణ పూర్తి చేయాలన్నారు.
ఇంటి యజమాని వేలి ముద్ర తప్పనిసరి..
కుల గణనలో భాగంగా సచివాలయ సిబ్బంది సర్వే పూర్తి చేసిన తర్వాత ఇంటి యజమాని తప్పకుండా వేలిముద్ర వేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. యజమాని అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. ఆ ప్రాంతంలో నెట్ వర్క్ లేకపోతే నెట్ వర్క్ ఉన్న ప్రాంతానికి వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. కుల గణన తర్వాత జిల్లాలో ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, వారికి ప్రభుత్వ పథకాలు అందాయా, లేదా అనే వివరాలు తెలుస్తాయన్నారు. అర్హులై ఉండీ సంక్షేమ పథకాలు పొందలేని వారికి వెంటనే మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, వాల్మీకి, బోయ కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నళిని, సీపీఓ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలాజ్యోతి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రాం తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 27 నుంచి
డిసెంబర్ 10 వరకూ ప్రక్రియ
కలెక్టర్ అరుణ్‌బాబు వెల్లడి
కుల సంఘాల పెద్దలతో సమావేశం