
● గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను
ఆహ్వానించిన సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు
ప్రశాంతి నిలయం: ‘అందరినీ ప్రేమించి, అందరినీ సేవించు’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తులను పొందిన సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బృందం ఆహ్వానించింది. మంగళవారం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌రాజుతో పాటు ట్రస్ట్ సభ్యులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మార్యాదపూర్వకంగా కలిశారు. సత్యసాయి జయంత్యుత్సవాల్లో భాగంగా ఈనెల 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగుతుందని, వేడుకల్లో పాల్గొనాలని కోరారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని ప్రశాంతి నిలయం మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. గవర్నర్‌ను కలిసిన వారిలో సత్యసాయి సేవా సంస్ధల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, ఎన్టీఆర్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు.
గంజాయి విక్రేతలకు జైలు శిక్ష
పుట్టపర్తి టౌన్: గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన కేసులో ముగ్గురు ముద్దాయిలకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, ఫ్యామిలీ కోర్టు జడ్జి టి.హరిత మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. 2020 డిసెంబర్ 21న పుట్టపర్తిలోని సాయినగర్‌లో గంజాయి విక్రయిస్తున్న శ్రీనివాసులు, హర్షవర్దన్, రమేష్‌లను అప్పటి అర్బన్ సీఐ వెంకటేశ్‌నాయక్ తన సిబ్బందితో అరెస్టు చేశారు. విచారణ అనంతరం చార్జ్‌షీటు దాఖలు చేశారు. అనంతపురంలోని ఒకటో అదనపు జిల్లా జడ్జి, ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ లక్ష్మినారాయణరెడ్డి ఐదుగురు సాక్షులను విచారించారు. ఇరువర్గాల వాదనలు, కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట నేరం రుజువు కావడంతో ముద్దాయిలు శ్రీనివాసులు, హర్షవర్దన్, రమేష్‌లకు నాలుగు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ జడ్జి టి.హరిత మంగళవారం తీర్పు చెప్పారు.