కదిరి: గ్యాస్ బండ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. రోజుల తరబడి ప్రయత్నిస్తున్నా...సిలిండర్ బుక్ కావడం లేదు. సిలిండర్ బుక్ అయినా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం చాలా వరకూ హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లు దొరక్క తల్లడిల్లుతున్నారు. కొందరైతే కొద్ది రోజులుగా హోటళ్లను మూసివేశారు. ఇంకొందరు కట్టెల పొయ్యి మీద చేస్తూ ధరలు పెంచేశారు.
నాలుగు రోజుల్లోనే 56,215 బుకింగ్స్..
జిల్లాలోని వినియోగదారులకు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలకు చెందిన ఏజెన్సీల ద్వారా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. సాధారణంగా రోజుకు సగటున 9,325 ఎల్‌పీజీ సరఫరా ఉంటుంది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో బుకింగ్స్ బాగా పెరిగాయి. గడచిన నాలుగు రోజుల్లోనే 56,215 బుకింగ్స్ జరిగాయి. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్లు ప్రభుత్వం సిలిండర్లు సరఫరా చేయలేక పోతోంది. దీంతో రోజు రోజుకూ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సర్వర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
పండుగ పూట పస్తులేనా?
హిందువులకు అతి పెద్ద పండుగ ఉగాది. మరోవైపు ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్ ఈసారి ఒక్క రోజు తేడాతో వచ్చాయి. దీంతో గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో గంటల తరబడి ఏజెన్సీల వద్ద క్యూలో ఉంటూ అవస్థలు పడుతున్నారు. ఇంకొందరు గ్యాస్ బుకింగ్ నంబర్ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ క్యాష్ చేసుకుంటుంటే, గ్యాస్ డెలివరీ బాయ్స్ గృహావసర గ్యాస్ సిలిండర్‌ను డిమాండ్‌ను బట్టి రూ.1,700 నుంచి రూ.2 వేల వరకూ అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు.
ఆంక్షలతోనూ ఇబ్బందులే..
గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక... మరో సిలిండర్ బుక్ చేయాలంటే పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలనే ప్రభుత్వ ఆంక్షలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటి వరకూ కొందరు ఏజెన్సీ నిర్వాహకులే వినియోగదారుడికి తెలియకుండా వారి పేరు మీద గ్యాస్ బుక్ చేసి మరొకరికి ఇచ్చేవారు. సబ్సిడీ తమ ఖాతాలో జమ అవుతున్నందున వినియోగదారులు సైతం ఇన్ని రోజులూ పెదవి విప్పలేకపోయారు. ఇలాంటి వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.
వాణిజ్య సిలిండర్‌కూ తప్పని తిప్పలు..
వాణిజ్య సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, ఇతర చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సర్వీసులకు సంబంధించి వాణిజ్య గ్యాస్ సిలిండర్లను మాత్రం సరఫరా చేస్తున్నామని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
సామాన్యులపై భారం..
గృహావసర వినియోగ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 మేర ధర పెంచేశారు. పెంచిన ధరలు రాత్రికి రాత్రి అమల్లోకి వచ్చేశాయి. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో గ్యాస్ కష్టాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
మూడు రోజుల క్రితం ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో నల్లమాడ మండలానికి చెందిన నరసింహులు బుక్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. బుక్ చేసే ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులను కలిస్తే... బుకింగ్ లేకుండా సిలిండర్ ఇవ్వడం కుదరదన్నారు. పండుగకు బంధువులంతా వచ్చారని, ఈ పరిస్థితుల్లో ఇంట్లో గ్యాస్ లేకపోతే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. బంధువులు, స్నేహితులందరికీ ఫోన్లు చేసి సిలిండర్ కోసం ఆరా తీస్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు.
ఇబ్బందులు పడుతున్న సామాన్యులు
బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్
రూ.1,700
కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఏజెన్సీలు,
డెలివరీ బాయ్స్


