ధర్మవరం రూరల్: జాయింట్ పట్టాల విభజనతోనే మేలు జరుగుతుందని రైతులకు జేసీ ఎం.మౌర్య భరద్వాజ్ వివరించారు. మండల పరిధిలోని గొట్లూరులో జాయింట్ పట్టా సబ్ డివిజన్ ప్రక్రియపై బుధవారం నిర్వహించిన గ్రామ సభలో జేసీ మాట్లాడారు. భూ క్రయ విక్రయాల్లో, బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందడంలో, ప్రభుత్వ పథకాల వర్తింపజేయడంలో జాయింట్ పట్టాల వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వ్యక్తిగత పట్టాలు ఉంటేనే పూర్తి హక్కులు ఉంటాయన్నారు. జాయింట్ పట్టా ఉన్న రైతులు వెంటనే సబ్ డివిజన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామసుబ్బయ్య, జిల్లా సర్వే అధికారి విజయశాంతి, తహసీల్దార్ సురేష్, సర్వేయర్లు పాల్గొన్నారు.


