ఏర్పాట్లు పూర్తి
గురువారం రాత్రి జరిగే చౌడేశ్వరీదేవి పంచమ జ్యోతుల ఉత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామమంతా విద్యుద్దీపాలతో అలంకరించాం. ఉత్సవానికి 30 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశాం. రాత్రి 3 గంటలకు జ్యోతుల ఉత్సవం ప్రారంభమవుతుంది.
– డి.సి.ఈశ్వరయ్య, ఆలయ ధర్మకర్త
పరస్పర సహకారంతో..
ఏటా అమ్మవారి జ్యోతుల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారిపై ఉన్న భక్తి భావంతో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. చౌడేశ్వరీమాత అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం. ఉత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– చింతా హరిదాస్, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు, సోమందేపల్లి
పెనుకొండ:(సోమందేపల్లి): కొలిచిన వారి ఇంట కొంగుబంగారమని సోమందేపల్లిలోని చౌడేశ్వరీదేవి అమ్మవారు భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవానికి సోమందేపల్లి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా ఉగాది పర్వదినాన అమ్మవారి పంచమ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవానికి వివిధ గ్రామాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే బంధుమిత్రులతో సోమందేపల్లిలోని గృహాలు కిటకిటలాడుతున్నాయి. దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి ఉత్సవంలో పాల్గొననున్నట్లు అంచనా. రాత్రి 3 గంటల అనంతరం ఆలయంలో చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా జ్యోతులను తలపై ఉంచుకుని అమ్మవారిని స్తుతిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం
చౌడేశ్వరీదేవి ..
నేడు సోమందేపల్లిలో జ్యోతుల ఉత్సవం


