పుట్టపర్తి టౌన్: దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బుదవారం పుట్టపర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో కలసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలసి బస్సులో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... దివ్యాంగులు బలహీన వర్గం కాదని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అసాధారాణ ప్రతిభ కనబరుస్తారని అన్నారు. దివ్యాంగులు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎం మధుసూదన్, ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్థితోపాటు దివ్యాంగులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ
కదిరి టౌన్: స్థానిక మదనపల్లి మార్గంలోని బళ్లారి కాంపౌండ్ వద్ద గల ఉన్న వలీవుల్లా మసీదుల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎస్పీ సతీష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఎస్పీ శివనారామణస్వామి, సీఐ వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ఎస్పీ పాల్గొని ఉపావాస దీక్షలు కొనసాగిస్తున్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుదాఘాతంతో
మహిళ మృతి
పరిగి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. పరిగి మండలం శ్రీరంగరాజుపల్లిలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామాంజప్ప, నరసమ్మ (52) దంపతులకు కుమారుడు గంగాధరప్ప, కోడలు శివమ్మ, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న స్టే వైర్‌కు ఆరేసిన దుస్తులను నరసమ్మ తీస్తుండగా కరెంట్ షాక్ గురై గట్టిగా కేకలు వేసింది. రక్షించేందుకు ప్రయత్నించిన కుమారుడు గంగాధరప్ప, భర్త రామాంజినప్ప, మనవళ్లు నవీన్, కళ్యాణ్ సైతం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను బంధువులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో నరసమ్మ మృతి చెందింది. మిగిలిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని జీజీహెచ్‌కు వైద్యులు రెఫర్ చేశారు. మృతురాలి కోడలు శివమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


