పుట్టపర్తి అర్బన్: అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా కురుస్తున్న వర్షంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానతో మామిడి కాయలన్నీ నేలరాలాయి. కలింగర, దోస పంటలకు కూడా అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. ప్రస్తుతం కలింగర, దోస పంటలు కోత దశలో ఉండగా... వడగండ్ల వానతో కాయలు పగిలి పోతున్నాయి.
గాలీ వాన బీభత్సం
బుధవారం సాయంత్రం గాలీవీన బీభత్సం సృష్టించింది. గంటన్నర పాటు కురిసిన వడగండ్ల వానతో బుక్కపట్నం మండలం ధూపంపల్లిలో భాస్కర్, బాలకృష్ణ అనే మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వారిద్దరూ ఐదు ఎకరాల్లో 350 మామిడి చెట్లు సాగు చేస్తుండగా...బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో కాయలన్నీ నేలరాలాయని రైతులు వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అలాగే చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లిలో 60 ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలన్నీ రాగిపోగా రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగింది. ఇక పుట్టపర్తి, గోరంట్ల, కొత్తచెరువు, బుక్కపట్నం, చిలమత్తూరు, ధర్మవరం, కదిరి తదితర మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. కొత్తచెరువు, లోచర్లలో వడగండ్ల వాన దంచికొట్టింది. మంగళవారం రాత్రి చిలమత్తూరు మండలంలో 13.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రొళ్లలో 7.2 మి.మీ, హిందూపురం 2.6, పరిగిలో 2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
నేలరాలిన మామిడి
ఆందోళనలో రైతులు


