● ఈ రోజు ఆత్మకూరు ఆర్డీఓ..
రేపు ఇంకెందరో..
● ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు ఉద్యోగుల భవిష్యత్ తాకట్టు
● ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్
ఎన్నికలో మంత్రి జోక్యంతో వివాదం
● వ్యవహారం బెడిసికొట్టడంతో తప్పంతా అధికారులదేనంటూ
తప్పించుకునే యత్నం
● మున్సిపల్, పరిషత్, పంచాయతీ
ఎన్నికల్లోనూ అడ్డగోలుగా చేసిన
అధికారిణి
● మంత్రి చెప్పారని అడ్డగోలుగా
వ్యవహరించిన ఆర్డీఓ
● ఎన్నికల వ్యవస్థ, నిబంధనలకు
విరుద్ధంగా బరితెగింపు
● ఆనం పీక మీదకు వచ్చేసరికి
తప్పంతా ఆర్డీఓదేనంటూ బుకాయింపు
● ప్రభుత్వం మారిన తర్వాత..
జైలు ఊచలు లెక్కించడం ఖాయం
ఆర్డీఓ
బి పావని
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాజకీయ నాయకుల మెప్పు కోసం రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి.. ప్రజాస్వామ్యాన్ని పాతరేసే అధికారులు చివరకు బలిపీఠం ఎక్కక తప్పదని ఆత్మకూరు ఆర్డీఓ బీ పావని ఎపిసోడ్ ఒక ఉదంతంగా నిలుస్తోంది. జిల్లాలో జరిగిన.. జరుగుతున్న పుర, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ స్థాయి ఆర్వో నుంచి జిల్లా ఆర్వో కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకు అధికార పార్టీ నేతలు చెప్పారని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించారు. ఎన్నికల వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులు, పోలీసులు బరితెగించి.. రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారు. ఇప్పటికే ఇటు ఖాకీలు.. అటు రిటర్నింగ్ అధికారుల దాష్టీకాలకు దెబ్బతిన్న బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసులు విచారణ దశకు వచ్చే సరికి ఇప్పుడు ఆదేశించిన ప్రజాప్రతినిధులెవరూ తమదే బాధ్యత అని చెప్పడానికి ముందుకు రారు. తర్వాత కాలంలో ప్రభుత్వం మారితే.. రాజ్యాంగపరమైన విధివిధానాలను కాలరాసిన.. ఈ కాలకేయులు జైలు ఊచలు లెక్కించడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందనే విషయాన్ని మరిచిపోతున్నారు.
తూచ్.. తప్పంతా ఆర్డీఓదే!
రాజ్యాంగబద్ధంగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా.. ప్రమాణ స్వీకారం చేస్తే.. పదవి కాలం ముగిసే వరకు కొనసాగాల్సిందే. అదే పరోక్ష పదవుల విషయంలో కనీసం రెండున్నరేళ్లు దాటితేనే అవిశ్వాసంతో ఆ ప్రజాప్రతినిధిని పదవీచ్యుతుడిని చేసే అవకాశం ఉంది. అయితే ఆత్మకూరు మున్సిపాలిటీలో చట్ట విరుద్ధంగా ఇప్పుడు ఇద్దరు వైస్ చైర్‌పర్సన్లతో ప్రమాణస్వీకారం చేయించి.. రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ పావని చట్టాన్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించి బలిపీఠంపై కూర్చొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారని అడ్డగోలుగా వ్యవహరించిన ఆర్డీఓ ఇప్పుడు రాజ్యాంగపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. తాజా పరిణామాలు ఆమె మెడకు చుట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఆనం తన రాజకీయ స్వార్థానికి వ్యవహరించిన తీరుతో రాజ్యాంగపరమైన చిక్కులు తలెత్తడంతో.. తూచ్ తప్పంతా ఆర్డీఓదేనంటూ కౌన్సిల్ సాక్షిగా మాట్లాడడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పటికే ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు పరిషత్, పంచాయతీ ఎన్నికల్లోనూ మంత్రి చెప్పారని.. గ్రూప్–1 అధికారిణి అయిన ఆర్డీఓ ఎన్నికల ప్రక్రియను కాలరాశారు.
ఆత్మకూరులో ప్రజాస్వామ్యం ఖూనీ
పుర, పరిషత్, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇలాకా ఆత్మకూరులో ఖూనీ అయింది. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ పచ్చచొక్కాలు ధరించిన కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న అధికారుల తీరును చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు. నామినేషన్ల పర్వంలో పోలీసులు అడ్డుకుంటే.. పరిశీలిన.. తిరస్కరణ, పోలింగ్, కౌంటింగ్‌లో ఆర్వోలు అడ్డుగోలుగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఆర్వోలు ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు తిరస్కరించారు. కౌంటింగ్‌లో బ్యాలెట్స్ మార్చేసి.. గెలిచిన ప్రతిపక్ష అభ్యర్థులను ఓడించారు. ఓడిపోయి అప్రజాస్వామ్యవాదులను గెలిచిపించి.. రాజ్యాంగాన్ని ఓడించారు. అంతిమంగా ప్రజాస్వామ్య పీఠంపై అక్రమార్కులను కూర్చొబెట్టారు. ఇందుకు సహకరించిన పోలీసుల నుంచి అధికారుల వరకు బలిపీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఆత్మకూరు ఆర్డీఓ అయ్యారు.. రేపు.. ఈ జాబితాలోకి ఇంకెందరు వస్తారో వేచిచూడాల్సి ఉంది.
కత్తి పద్మజ కోర్టుకెళ్తే..
ఆర్డీఓకు శిక్ష తప్పదు
ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీ తరఫున కొలగాని శిరీషను ఖారారు చేస్తే.. మంత్రి ఆనం అధికార అహకారంతో చట్ట విరుద్ధంగా అదే పార్టీలోని కత్తి పద్మజతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇదంతా చట్టబద్ధంగా నిర్వహించారు. వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై నట్లు ఆమె సంతకాలు కూడా చేశారు. అయితే ఆమె రాజీనామా చేయకుండానే అదే స్థానానికి తిరిగి కొలగాని శిరీషతో ప్రమాణస్వీకారం చేయించారు. మరోసారి వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటే.. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించాకే నిర్వహించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. స్థానిక ఎన్నికల్లో ఇష్టారీతిని చేసినట్లుగానే వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియను కూడా చేపట్టారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో సాంకేతికంగా ఇద్దరు వైస్ చైర్‌పర్సన్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కత్తి పద్మజ మంగళవారం జరిగిన ఎన్నిక ప్రక్రియకు హాజరైనా.. బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె కోర్టు మెట్లు ఎక్కితే.. ఆర్డీఓ పావనికి చట్టపరమైన శిక్ష తప్పదని న్యాయ నిపుణులు విశదీకరిస్తున్నారు..


