నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును డిసెంబర్ ఐదులోపు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో తొమ్మిది వరకు.. రూ.200తో 13 వరకు.. రూ.500తో 18 వరకు చెల్లించేందుకు అవకాశముంటుందని చెప్పారు. విద్యార్థుల వివరాలను సంబంధిత యూడైస్ ప్లస్ లాగిన్‌లో తప్పక అప్‌డేట్ చేసి సరిచూసుకోవాలని సూచించారు. యూడైస్ ప్లస్, పోర్టల్లో వివరాలను సమర్పించాక, ఫీజును స్కూల్ లాగిన్ ద్వారా చెల్లించాలని కోరారు.
దాడి ఘటనలో
పది మందిపై కేసు నమోదు
సీతారామపురం: ఎన్నికల అధికారులపై కూటమి మూకలు దాడి చేసిన ఘటనలో పది మందిపై కేసును నమోదు చేశామని ఎస్సై వెంకటరాజేష్ బుధవారం తెలిపారు. రిటర్నింగ్ అధికారి గుర్రం శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు బసినేనిపల్లికి చెందిన ముడమాల రమేష్‌రెడ్డి, సుమంత్, సాయి, విజయ్, గోవిందు, వినయ్, జాన్సన్ తదితరులపై కేసును నమోదు చేశామని వివరించారు. మరికొందరిపై నమోదు చేయాల్సి ఉందన్నారు.
వీబీ – జీ – రామ్‌జీలో నలుగురి సస్పెన్షన్
దుత్తలూరు (ఉదయగిరి): మండలంలో వీబీ – జీ – రామ్‌జీ పథకంలో పనిచేస్తున్న నలుగురు సస్పెన్షన్‌కు గురయ్యారు. కొలతల్లో తేడాలతో పాటు అక్రమాలకు పాల్పడ్డారనే అంశాన్ని ఇటీవల నిర్వహించిన సోషల్ ఆడిట్‌లో గుర్తించారు. ఈ క్రమంలో ఇన్‌చార్జి ఈసీ హజరత్‌నాయక్, బీఎఫ్టీ రామకృష్ణ, ఏపీఓ బ్రహ్మయ్య, బండకిందపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ జయకుమార్‌పై సస్పెన్షన్ వేటేశామని ఎంపీడీఓ మల్లికార్జున తెలిపారు.
జాప్యం.. గోప్యం
● వివాదాస్పదంగా ఆర్వోల తీరు
● మధ్యాహ్నం మూడింటికే పరిశీలన పూర్తయినా.. అర్ధరాత్రి వరకు గప్‌చుప్
నెల్లూరు (పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి టీడీపీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన, విత్‌డ్రాల ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటలకే పూర్తయినా, వివరాలను రాత్రి వరకు ప్రకటించలేదు. ఈ జాప్యం వెనుక అధికారుల కుయుక్తులున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఆఫీసర్ల లోపాయికారీ ఒప్పందాలతోనే ఇలా జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 59,413 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 20,015 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.5 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనమవుతోంది. ఇవి లేని వారికి 12 గంటలు పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


