పోలింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు సర్వం సిద్ధం

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

ఎలక్షన్లకు పటిష్ట బందోబస్తు

● కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

అల్లూరు: జిల్లాలో గురువారం జరగనున్న మున్సిపల్‌.. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అల్లూరులోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని సందర్శించి.. వివిధ అంశాలపై అధికారులను ఆరాతీశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి స్థానిక రామకృష్ణ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ మొదటి విడత ఎన్నికలు నేడు

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ మొదటి దశ పోలింగ్‌ను గురువారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఎనిమిది మండలాల్లోని 114 పంచాయతీలు.. 993 వార్డులకు ఎలక్షన్‌ను నిర్వహించి, ఆపై ఓట్లను లెక్కించనున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా 298ను గుర్తించారు. ప్రతి వార్డుకో పోలింగ్‌ కేంద్రం.. 650కు మించి ఓట్లుంటే రెండింటిని ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్‌ అనంతరం ప్రత్యేక సమావేశాన్ని జరిపి, ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికల సామగ్రితో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి తమకు కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. వాస్తవానికి 134 సర్పంచ్‌.. 1332 వార్డులకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, ఇందులో వరుసగా 20.. 393 ఏకగ్రీవమయ్యాయి.

సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోనే వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీడియో కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ప్రక్రియను రికార్డు చేయనున్నారు. పంచాయతీల్లో అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ఓట్లను లెక్కించనున్నారు.

స్థానికేతరులు వెళ్లిపోవాలి

నెల్లూరు రూరల్‌: ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిని విడిచి వెళ్లాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. గ్రామాల్లో వీరు బస చేయకుండా లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో తనిఖీలు చేయనున్నామని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో గురువారం నిర్వహించనున్న కావలి, గూడూరు మున్సిపాల్టీలు, అల్లూరు నగర పంచాయతీ.. ఎనిమిది మండలాల పరిధిలోని 114 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూట్‌ మొబైల్స్‌, స్ట్రయ్‌కింగ్‌, స్పెషల్‌ స్ట్రయ్‌కింగ్‌ ఫోర్సులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, పోలీస్‌ పికెట్లు, డ్రోన్‌ బృందాలను సిద్ధం చేశామని వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్‌ బలగాలతో పాటు మొబైల్‌ పెట్రోలింగ్‌, ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరింపులు, ఘర్షణలకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీసులు లేదా డయల్‌ 112కు సమాచారమందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement