డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ పరిశీలన

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

పొదలకూరు: ఎస్పీ అజిత వేజెండ్ల పొదలకూరు డీఎన్నార్‌ జెడ్పీ హైస్కూల్లో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సమస్యాత్మకంగా గుర్తించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కోసం 700 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నారు.

వీఎస్‌యూ అకడమిక్‌ డీన్‌గా ప్రసాద్‌

వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) అకడమిక్‌ డీన్‌గా అందె ప్రసాద్‌కు వీసీ అల్లం శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు అప్పగించారు. ఆయన వర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ను వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సునీత అభినందించారు.

రెస్క్యూ సిబ్బందికి

ఘన సన్మానం

ముత్తుకూరు: సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల రక్షణ చర్యల్లో పాల్గొన్న ముగ్గురు కానిస్టేబుళ్లు, ముగ్గురు మత్స్యకారులను ముత్తుకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన వారి సేవలను అధికారులు అభినందించారు. రక్షించిన మత్స్యకారులను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలకు తూట్లు

● గణేశ్వరపురంలో టీడీపీ జెండాలతో రేకుల షెడ్డు

● ఓటర్లకు మద్యం, విందు ఏర్పాటు

చేస్తున్నారని ఆరోపణలు

వరికుంటపాడు: మండలంలోని గణేశ్వరపురం పంచాయతీలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గ్రామంలోని తారురోడ్డుకు సమీపంలో ఓ రేకుల షెడ్డుకు టీడీపీ జెండాలు కట్టి, ఓటర్లకు మద్యం, విందు ఏర్పాటుచేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకే ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ ఆ తర్వాత కూడా ఈ తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉంది. అయితే గణేశ్వరపురం పంచాయతీలో జరుగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత పంచాయతీ, మండల అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement