● టీడీపీ నాయకుడి రూల్
ఆత్మకూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ వద్దే మద్యం కొనాలని, ఇందుకు డిపాజిట్ చేయాలని రూల్ కూడా పెట్టారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బట్టేపాడు మార్గంలో ఏర్పాటు చేసిన షాప్ నంబర్ 141ని ఓ టీడీపీ నాయకుడు దక్కించుకున్నాడు. నూతన ఎకై ్సజ్ నిబంధనల మేరకు దీనిని ఆయన నిర్వహించాల్సి ఉంది. అయితే సమీప గ్రామాల్లో బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నాడు. తన షాపు నుంచి సరుకు తీసుకెళ్లాలని, ప్రతి బెల్టు దుకాణదారుడు రూ.5 వేలు చొప్పున డిపాజిట్ చేయాలని, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సదరు నేత హుకుం జారీ చేశాడు.
కొనుగోలు చేయాలని హుకుం
ఈ దుకాణం ఆత్మకూరు – బట్టేపాడు మార్గంలో ఉంది. దీని పరిధిలోని అప్పారావుపాళెం, బట్టేపాడు, కొట్టాలు, కనుపూరుపల్లి, మురగళ్ల, నల్లపరెడ్డిపల్లి, వీర్లగుడిపాడు, తదితర గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించాలంటే తన దుకాణంలోనే మద్యం కొనుగోలు చేయాలని సదరు నేత షరతు పెట్టడం చర్చనీయాంశమైంది. ఆ నాయకుడు మండలంలోని బట్టేపాడు గ్రామ నడిబొడ్డున దియ్యమ్మ (దివ్యమాంబ) దేవాలయం, ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు కూతవేటు దూరంలో బస్‌షెల్టర్ పక్కనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఓ రూము నిర్మించాడు. దానిని అద్దెకిచ్చి అక్కడ సైతం బెల్టు దుకాణం నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయమై ఆత్మకూరు ఎకై ్సజ్ ఎస్సై గౌతమ్‌ను సంప్రదించగా ఆ ప్రాంతంలో నూతన మద్యం దుకాణాన్ని ఇటీవలే కేటాయించినట్లు చెప్పారు. బెల్టు షాపుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


